కొల్లేట్లో కలిపేశారు!
కొల్లేటికోట (కైకలూరు) : సీన్ రిపీటైంది.. అదే ప్రదేశం.. అవే డిమాండ్లు.. నాయకులు, పార్టీ రంగులు మారాయంతే. కొల్లేరు కాంటూరు కుదింపుపై 2010లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్ ఏం చెప్పారో ఇప్పటి బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్ అవే పలుకులు పలికారు. దీంతో హస్తానికి, కమలానికి పెద్ద తేడా లేదని గమనించడానికి కొల్లేరు ప్రజలకు ఎంతో సమయం పట్టలేదు. కొల్లేరు కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదించి మిగులు భూములు పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో శుక్రవారం కొల్లేటికోట సభ జరిగింది. హాజరైన ఇద్దరు మంత్రులు సుప్రీంకోర్టు పేరు చెప్పి కాంటూరు కుదింపు అంశాన్ని కొల్లేట్లో కలిపేశారు.
సమయమంతా పొగడ్తలకే సరి...
కాంగ్రెస్ మోసం చేసిందని, పైన బీజేపీ.. కింద టీడీపీ ఉందని, కొల్లేరు సమస్యలు తీర్చడం ఇప్పుడు తమ చేతుల్లో పనేనని నేతలు డాంబికాలు పలకడంతో నిజమేననుకున్న కొల్లేరు ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. అధికార బలం ఉన్నవాళ్లు కొల్లేరులో చేపల చెరువులు తవ్వేసుకుంటున్నారు. మిగులు భూములు పంపిణీ చేస్తారనే గంపెడాశతో కొల్లేరు ప్రజలు సభకు వచ్చారు. కొల్లేటి పెద్దలు అధికార పక్ష నాయకులను పొగడడానికే ఎక్కువ సమయం కేటాయించారు. పుష్కర స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హడావుడిగా ఇక్కడకు తీసుకురావడం, ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం ఎందుకని పలువురు విమర్శించారు.
నేతలకు జనం ఝలక్... ప్రతిసారీ కొల్లేరులో భూములు ఇస్తామంటూ ప్రజలను సభలకు తీసుకువచ్చే నాయకులకు ఈసారి జనం ఝలక్ ఇచ్చారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 30 వేల మంది హాజరవుతారని గొప్పలు పలికిన కొల్లేరు పెద్దలకు పెద్ద షాక్ తగిలింది. 4వేల మంది మాత్రమే హాజరయ్యారు. వారం రోజులుగా పొక్లెయిన్‌తో భూములను చదును చేసి వేసిన కుర్చీలు జనం లేక వెలవెలబోయాయి. సీన్ అర్థమైన కొల్లేరు పెద్దలు వెయ్యకుండా మిగిలిన కుర్చీలను అలాగే ఉంచాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వంతెన లేకపోవడంతోనే జనాలు రాలేదని కవర్ చేసినా.. వచ్చిన వాహనాలన్నీ అదే వంతెనపై నుంచి వస్తాయనే విషయాన్ని మరిచారు.