Minister Javadekar
-
కలసి కృషి చేద్దాం: ఒబామా
వాతావరణ ఒప్పందంపై మోదీకి ఫోన్ వాషింగ్టన్/పారిస్: అంతర్జాతీయ వాతావరణ ఒప్పందంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి మాట్లాడారు. సమర్థవంతమైన ఒప్పందం దిశగా కృషి చేద్దామని వారు నిర్ణయించారు. పారిస్ ఐరాస్ వాతావరణ సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ భేటీ అయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే మోదీకి ఒబామా ఫోన్ చేశారు. ఈ వివరాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వంద బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు ప్రక్రియ పురోగతి సాధించిందంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదికను బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా తప్పుబట్టాయి. -
కొల్లేట్లో కలిపేశారు!
కొల్లేటికోట (కైకలూరు) : సీన్ రిపీటైంది.. అదే ప్రదేశం.. అవే డిమాండ్లు.. నాయకులు, పార్టీ రంగులు మారాయంతే. కొల్లేరు కాంటూరు కుదింపుపై 2010లో అప్పటి కాంగ్రెస్ కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్ ఏం చెప్పారో ఇప్పటి బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్ అవే పలుకులు పలికారు. దీంతో హస్తానికి, కమలానికి పెద్ద తేడా లేదని గమనించడానికి కొల్లేరు ప్రజలకు ఎంతో సమయం పట్టలేదు. కొల్లేరు కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదించి మిగులు భూములు పంపిణీ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో శుక్రవారం కొల్లేటికోట సభ జరిగింది. హాజరైన ఇద్దరు మంత్రులు సుప్రీంకోర్టు పేరు చెప్పి కాంటూరు కుదింపు అంశాన్ని కొల్లేట్లో కలిపేశారు. సమయమంతా పొగడ్తలకే సరి... కాంగ్రెస్ మోసం చేసిందని, పైన బీజేపీ.. కింద టీడీపీ ఉందని, కొల్లేరు సమస్యలు తీర్చడం ఇప్పుడు తమ చేతుల్లో పనేనని నేతలు డాంబికాలు పలకడంతో నిజమేననుకున్న కొల్లేరు ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి. అధికార బలం ఉన్నవాళ్లు కొల్లేరులో చేపల చెరువులు తవ్వేసుకుంటున్నారు. మిగులు భూములు పంపిణీ చేస్తారనే గంపెడాశతో కొల్లేరు ప్రజలు సభకు వచ్చారు. కొల్లేటి పెద్దలు అధికార పక్ష నాయకులను పొగడడానికే ఎక్కువ సమయం కేటాయించారు. పుష్కర స్నానాలకు వచ్చిన కేంద్ర మంత్రులను హడావుడిగా ఇక్కడకు తీసుకురావడం, ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడం ఎందుకని పలువురు విమర్శించారు. నేతలకు జనం ఝలక్... ప్రతిసారీ కొల్లేరులో భూములు ఇస్తామంటూ ప్రజలను సభలకు తీసుకువచ్చే నాయకులకు ఈసారి జనం ఝలక్ ఇచ్చారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 30 వేల మంది హాజరవుతారని గొప్పలు పలికిన కొల్లేరు పెద్దలకు పెద్ద షాక్ తగిలింది. 4వేల మంది మాత్రమే హాజరయ్యారు. వారం రోజులుగా పొక్లెయిన్‌తో భూములను చదును చేసి వేసిన కుర్చీలు జనం లేక వెలవెలబోయాయి. సీన్ అర్థమైన కొల్లేరు పెద్దలు వెయ్యకుండా మిగిలిన కుర్చీలను అలాగే ఉంచాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ వంతెన లేకపోవడంతోనే జనాలు రాలేదని కవర్ చేసినా.. వచ్చిన వాహనాలన్నీ అదే వంతెనపై నుంచి వస్తాయనే విషయాన్ని మరిచారు. -
పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వండి
కేంద్ర మంత్రి జవదేకర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు కోసం మంత్రి అశోక్ గజపతిరాజుకు వినతి సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కొమురం భీం ప్రాజెక్టులకు అటవీ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన జవదేకర్‌ను కలసి ఈ మేరకు విన్నవించారు. ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కొమురం భీం ప్రాజెక్టుల విషయంలో జవదేకర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కోరినట్టు హరీశ్ చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాలు నడిపించాలని కోరామన్నారు. తెలంగాణలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌లైన్స్ మెయింటనెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. ఆ నీటితో నదుల అనుసంధానానికి ఓకే బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే నీటి కేటాయింపులు చేసిన దానికన్నా అదనంగా ఉండే నీటి ద్వారా నదుల అనుసంధానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరంలేదని మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ జలవనరుల సలహాదారు విద్యాసాగర్‌రావు కేంద్రానికి స్పష్టం చేశారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సాగునీటి మంత్రుల ప్రత్యేక కమిటీ ఏర్పాటు రెండవ సమావేశంలో పాల్గొన్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.