పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులివ్వండి
కేంద్ర మంత్రి జవదేకర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు కోసం మంత్రి అశోక్ గజపతిరాజుకు వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాణహిత-చేవెళ్ల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కొమురం భీం ప్రాజెక్టులకు అటవీ అనుమతులను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆయన జవదేకర్‌ను కలసి ఈ మేరకు విన్నవించారు.
ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, కొమురం భీం ప్రాజెక్టుల విషయంలో జవదేకర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజును కోరినట్టు హరీశ్ చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి మరిన్ని అంతర్జాతీయ విమానాలు నడిపించాలని కోరామన్నారు. తెలంగాణలో కార్గో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌లైన్స్ మెయింటనెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు.
ఆ నీటితో నదుల అనుసంధానానికి ఓకే
బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే నీటి కేటాయింపులు చేసిన దానికన్నా అదనంగా ఉండే నీటి ద్వారా నదుల అనుసంధానం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరంలేదని మంత్రి హరీశ్‌రావు, తెలంగాణ జలవనరుల సలహాదారు విద్యాసాగర్‌రావు కేంద్రానికి స్పష్టం చేశారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సాగునీటి మంత్రుల ప్రత్యేక కమిటీ ఏర్పాటు రెండవ సమావేశంలో పాల్గొన్న అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.