2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం | Samiya Campaign 2nt | Sakshi
Sakshi News home page

2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం

Published Mon, Dec 30 2013 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM

2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం

2 నుంచి సమైక్య ఉద్యమం ఉధృతం

మచిలీపట్నం, న్యూస్‌లైన్ : నూతన సంవత్సరంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఏపీ ఎన్జీవోల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి చెప్పారు. సంఘ నాయకులతో కలసి ఆదివారం మచిలీపట్నం వచ్చిన ఆయన తూర్పు కృష్ణా ఎన్జీవోల కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జనవరి రెండో తేదీ నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రాజకీయ పార్టీలతో కలుపుకొని చేయనున్నట్లు ఆయన వివరించారు. జనవరి రెండున విశాఖపట్నంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, మూడున రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. నాలుగున సీమాంధ్ర జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగులతో ర్యాలీలు, 6 నుంచి 10 వరకు అన్ని ప్రాంతాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు.
 
పీఆర్సీ, ఐఆర్ కోసం చర్చలు...
 
ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఇప్పించేందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నామని చంద్రశేఖరరెడ్డి తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వం తన చిత్తానుసారం వ్యవహరించిందన్నారు. ఉద్యోగులు కోరినవిధంగా నిబంధనలు మార్చి హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని, లేకుంటే వాటిని తిరస్కరిస్తామని చెప్పారు. జూన్ 30 నాటికి తెలంగాణ అంశంపై అన్ని రాజకీయ పార్టీలూ తలోదారిగా వ్యవహరించాయన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విడగొడుతున్నట్లు ప్రకటించిందన్నారు.

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఏవీవీఎస్‌వీవీ నరసింహం మాట్లాడుతూ ఈ రాష్ట్రం ఇప్పటి వరకు సమైక్యంగా ఉందంటే ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌లోని ఉద్యోగుల ఉద్యమమే కారణమన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు సంబంధించి మలివిడత చర్చ ప్రారంభం కాగానే సీమాంధ్రలో మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. దీంతో అసెంబ్లీ, పార్లమెంట్‌లపై ఈ ప్రభావం పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో తూర్పు కృష్ణా ఎన్జీవో అసోసియేషన్ కన్వీనర్ ఉల్లి కృష్ణ, అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు, కోశాధికారి దారపు శ్రీనివాస్, కార్యదర్శి కె.శివశంకర్, వెస్ట్ కృష్ణా అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకుడు టీఎస్‌ఆర్ ఆంజనేయులు, అవనిగడ్డ, నాగాయలంక, కైకలూరు, బంటుమిల్లి, మొవ్వ, పామర్రు, గుడివాడ తదితర ప్రాంతాల ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement