బీచ్‌రోడ్డులో ప్రమాదానికి గురైన ఇసుక లారీ
విశాఖపట్నం , అల్లిపురం(విశాఖ దక్షిణ): బీచ్‌రోడ్డు నోవాటల్ డౌన్‌లో ఇసుకలారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుకుని జీవీఎంసీ గోడను ధ్వంసం చేసి సమీపంలోని చిన్నపిల్లల పార్కు వరకు దూసుకుపోయింది. వేకువజామున కావడంతో జనసంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. మహారాణిపేట పోలీసులు, లారీ డ్రైవర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం... పంజాబ్ లారీ శ్రీకాకుళం నుంచి విశాఖలో ఫిషింగ్ హార్బర్‌కు ఇసుకలోడుతో వస్తుంది. గురువారం వేకువజామున 4గంటల సమయంలో జిల్లా కోర్టు రోడ్డు నుంచి పందిమెట్ట మీదుగా నోవాటల్ డౌన్ దిగుతుంది. ఆ సమయంలో ఒక్కసారిగా లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ రాంబాబు లారీని అదుపు చేయలేక ఎదురుగా గల ఫుట్‌పాత్‌ను ఢీకొని, సందర్శకులు కూర్చునే గోడను ఢీకొట్టడంతో అవతల రోడ్డులోకి ఒరిగిపోయింది. దీంతో లారీ ముందు చక్రాలు, సాసీ విరిగిపోవడంతో అక్కడ కూలబడిపోయింది. లారీ ప్రమాదానికి గురైన సమయంలో డ్రైవర్‌తో పాటు క్లీనర్, ముగ్గురు కూలీలు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
వేకువజామున 4గంటల సమయంలో కావడంతో అంతగా జనసంచారం లేకపోవడంతో ప్రమాదతీవ్రత తగ్గింది. గతంలో ఇక్కడే 2016లో స్కూల్‌బస్సు ఒకటి డౌన్‌లో బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన నగరవాసులు మరిచిపోక ముందే మరో ప్రమాదం అదే ప్రదేశంలో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment