మృత్యువులోనూవీడని బంధం | Couple Died in Lorry Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Published Sat, Nov 2 2019 11:23 AM | Last Updated on Tue, Nov 5 2019 12:37 PM

Couple Died in Lorry Accident Visakhapatnam - Sakshi

కశింకోట (అనకాపల్లి): మృత్యువులోను వీడని బంధం వారిది. సుమారు మూడు దశాబ్దాల క్రితం పెళ్లి అయినప్పటి నుంచి వారు ఎక్కడికైనా కలిసి వెళ్లేవారు. చివరగా కలిసి వస్తూనే రోడ్డు ప్రమాదంలో తనువు చాలించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తాళ్లపాలెం గ్రామానికి చెందిన కరణం సోమునాయుడు (62), భార్య పైడితల్లి (53) ప్రాణాలు కోల్పోయారు. పొలం నుంచి నడిచి ఆవు పాలు పిండి విక్రయానికి తీసుకు వస్తున్న వీరిని మృత్యువు కబలించింది. కాకినాడ నుంచి విశాఖ వైపు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ దూసుకు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందా రు. వీరు  పాడి పరిశ్రమ ద్వారా కుటుంబ జీవనం సాగిస్తూ వస్తున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారునికి వివాహం చేశారు. 

ఆయిల్‌ ట్యాంకర్‌ను తప్పించుకోలేక..
రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు వారివి.  వీరు పెళ్లి అయిన మొదలు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లినా ప్రేమికుల్లా కలిసి వెళ్లే వారు. పొలానికి కూడా కలిసే వెళ్లి తిరిగి వచ్చే వారు. వీరికి ఒక పాడి ఆవు ఉంది.  ఎప్పటిలాగే శుక్రవారం తెల్లవారుజామున సమీపంలోని మామిడివాక గెడ్డ పక్కన ఉన్న తమ పశువుల శాలకు వెళ్లి  ఆవు పాలు పిండుకొని  తిరిగి ఇంటికి నడిచి వస్తున్నారు. మార్గమధ్యలో మామిడివాక గెడ్డ వంతెన దాటిన తర్వాత వారిని ఆయిల్‌ ట్యాంకర్‌ రూపంలో మృత్యువు కబలించింది. దూసుకు వస్తున్న లారీని వారు చూసినప్పటికీ తప్పించుకోలేక పోయారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. వారిని ఢీకొన్న లారీ పక్కనే ఉన్న చెట్లలోకి దూసుకుపోయిందని వారు వివరించారు. 

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే..
డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇక్కడకు చేరే సరికి  డ్రైవర్‌ నిద్రలోకి జారుకొని ఉంటాడని, దీనివల్ల లారీ అదుపుతప్పి ప్రమాదానికి దారితీసి ఉండవచ్చునని వారు భావిస్తున్నారు. 

విషాదంలో కుటుంబాలు..
దంపతులు సోమునాయుడు, పైడితల్లి మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది. ఒకేసారి ఇద్దరు మృతి వారితోపాటు స్థానికులకు కలచి వేసింది. సంఘటన స్థలాన్ని అనకాపల్లి రూరల్‌ సీఐ నరసింహారావు సందర్శించారు.   మృత దేహాలకు   పోస్టుమా ర్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎల్‌.హిమగిరి తెలిపారు. దంప తుల మృతదేహాలకు బంధువులు, కుటుంబ సభ్యులు ఒకేసారి అంత్యక్రియలు జరిపించారు.

అదేచోట తరచూ ప్రమాదాలు
ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాది క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. అలాగే లారీలు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు పోయి పల్లపు ప్రాంతంలో బోల్తా పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. వంతెన నుంచి వాలు ఎక్కువగా దిగువకు ఉండటమే ప్రమాదాలకు కారణమని తెలుస్తోంది. దీన్ని సరిచేసి ప్రమాదాలు నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే ప్రమాదాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేయా లని పలువురు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement