కన్నవారి కళ్ల ఎదుటే ఘోరం | Girl Child Died in Lorry Accident Visakhapatnam | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన లారీ

Published Tue, Mar 5 2019 7:29 AM | Last Updated on Tue, Mar 5 2019 7:29 AM

Girl Child Died in Lorry Accident Visakhapatnam - Sakshi

లారీ చక్రం కింద జాహ్నవి మృతదేహం

దేవరాపల్లి(మాడుగుల) : మహా శివరాత్రి పర్వదినాన ఓ నిరుపేద కుటుంబంలో ఎనిమిదేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. కన్నకూతురు కళ్ల ఎదుటే లారీ చక్రాల కింద పడి మరణించడాన్ని చూసిన కన్నవారు పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లిపోయారు. దేవరాపల్లి–ఆనందపురం రోడ్డులో నల్లబిల్లి జంక్షన్‌లో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు జాహ్నవి(8) అనే బాలిక మృతి చెందింది. జాహ్నవి గోపాలపట్నంలోని ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతోంది. ప్రమాద వివరాలిలా ఉన్నాయి. చీడికాడ మండలం గోగాడ కొత్తపల్లికి చెందిన వంటాకు సూర్యనారాయణ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.

భార్య వరలక్ష్మి, కుమార్తె జాహ్నవి, కుమారుడు తనూలతో కలిసి గోపాలపట్నంలోని ఓ అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో అమ్మమ్మ ఇల్లు అయిన విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి సొంత ఆటోలో చేరుకున్నారు. అక్కడ ఆనందంగా గడిపి తిరిగి గోపాలపట్నం తన ఆటోలోనే తిరుగు పయనమయ్యారు. శివరాత్రి కావడంతో ఈ రోజు ఉండి మరుసటి రోజు వెళ్లాలని అమ్మమ్మ చెప్పగా జాహ్నవి మాత్రం తన పాఠశాలకు సెలవు లేదని స్కూల్‌ వెళ్లాలని చెప్పడంతో సోమవారం ఉదయం గోపాలపట్నం బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ ఇంటి ముందు ఉన్న ఆటో ఎక్కేందుకు ఆటో ముందు నుంచి జాహ్నవి ప్రయత్నించగా అదే సమయంలో విజయనగరం జిల్లా వావిలపాడు సమీపంలోని ఓ స్టోన్‌ క్రషర్‌ నుండి ఆనందపురం వైపు వస్తున్న భారీ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బాలిక లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడిక్కడే  దుర్మరణం పాలైంది. రెప్పపాటులో జరిగిన ఈ దుర్ఘటనలో తమ చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు వరలక్ష్మి, సూర్యనారాయణలు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డుపై జరిగిన ఈ ప్రమాద ఘటనను చూసిన ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. కంటతడి పెట్టుకున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వేపాడ పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement