పేట్రేగుతున్న ఇసుక మాఫియా | sand mafia | Sakshi
Sakshi News home page

పేట్రేగుతున్న ఇసుక మాఫియా

Published Thu, Jul 30 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

sand mafia

సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి సంపద అధికార పార్టీకి అక్రమార్జనగా మారింది. అడ్డుకుంటే అక్రమార్కులు కన్నెర్ర చేస్తారని భావిస్తూ చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఒకరిద్దరు తెగించి అడ్డుకోజూస్తే అక్రమార్కులు బహిరంగ దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వం సైతం ఏకపక్షంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు వెనక్కి తగ్గుతున్నారు. ప్రొద్దుటూరు పరిధిలోని రామాపురం ఇసుక మాఫియాకు అధికార పార్టీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఇసుక అక్రమ రవాణా మూడు ట్రాక్టర్లు ఆరు డంపులు అన్నట్లుగా సాగుతోంది.
 
  పెన్నా నదికి ఆనుకుని ఉన్న ఈ గ్రామంలో అధికార పార్టీకి చెందిన వారికి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఉన్నాయి. రాత్రి అయిందంటే చాలు ట్రాక్టర్లు పెన్నా నదిలోకి వెళ్లడం.. తెల్లవారేంత వరకూ అక్రమంగా ఇసుకను రవాణా చేయడం దినచర్యగా మారింది. ఇదంతా తెలిసిన రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు తెల్లవారాక వాకింగ్‌కు వెళ్లినట్లు వెళ్లి.. అక్కడ ఎద్దుల బండ్లపై వారి ప్రతాపం చూపించడం పరిపాటిగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు.
 
 ..ఆ రెడ్డి అడ్డుకున్నాడంటే అధికారులు హడల్...
 రామాపురం పేరు చెప్పగానే వినిపించేది ..ఆ రెడ్డి పేరే. ఏళ్ల తరబడి ఇసుక మాఫియా నడుపుతున్నాడు. ఏకంగా జేసీబీని పెన్నా నదిలోకి దింపి తెల్లవారే సరికి పట్టణంలోనే కాక చుట్టు పక్కల గ్రామాల్లో సాగుతున్న నిర్మాణాల వద్దకు ఇసుకను చేరుస్తున్నారు. నిత్యం రూ.లక్షలు ఆర్జిస్తున్నాడు.
 
 ఈయనకు ప్రొద్దుటూరు పెద్దాయన అండ పుష్కలంగా ఉండడంతో రెవిన్యూ యంత్రాంగం వెనక్కు తగ్గుతోంది. ధైర్యం చేసి ఓ తహశీల్దారు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లగా జీపును పెట్రోల్ పోసి అంటిస్తానంటూ బెదిరించిన సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. అంతటి బరితెగింపుగా వ్యవహరిస్తున్నా కూడా చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకంజ వేశారు. కారణం క్రికెట్ బెట్టింగ్ దారుకు అండగా నిలిచినట్లుగానే అధికార పార్టీ నేత ఇసుక మాఫియాకు అండగా ఉండడమేనని పలువురు వివరిస్తున్నారు.
 
 నియంత్రిస్తే ముప్పుతిప్పలే..
 గతంలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన వెంకటకృష్ణ రామాపురం గ్రామంపై దాడులు నిర్వహించి వందల ట్రాక్టర్ల ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఇసుకను నింపి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వాటిపై చర్యలు తీసుకున్నారు. అప్పట్లో ఆర్‌డీఓ కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఇసుక డంప్‌లను పరిశీలించి గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇన్ని వందల ట్రాక్టర్ల ఇసుకను చూసిన అధికారులు నోరెళ్లబెట్టారు. దీంతో ఇసుక మాఫియా ఏకంగా కమిషనర్ ఇంటిపైకి వచ్చి హల్‌చల్ చేసింది.
 
  ఓ దశలో కమిషనర్‌పై దాడికి యత్నించారు. తుదకు ఇసుక మాఫియాను అప్పట్లో పోలీసులకు అప్పగించారు. ఈ తతంగం అనంతరం అధికార పార్టీ నేత రంగ ప్రవేశం చేయడంతో కమిషనర్ కేసును వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఓమారు ఆర్‌ఐ షఫీపై కూడా రామాపురం రెడ్డి దౌర్జన్యానికి దిగిన సంఘటనలు ఉన్నాయి. ఇసుకను తరలిస్తున్న రామాపురం ట్రాక్టర్లను పట్టుకుని కార్యాలయానికి తరలించే సమయంలో దాడి చేసినంత పని చేసి ట్రాక్టర్లను తీసుకెళ్లిన సంఘటన కూడా లేకపోలేదు.
 
 ట్రాక్టర్‌పై నుంచి తోసివేయడంతో కట్టుబడికి గాయాలు..
 కొద్ది రోజుల కిందట బొజ్జవారిపల్లె కట్టుబడి నాయబ్ రామాపురం గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నాడు. ట్రాక్టర్‌పై కూర్చుని రెవెన్యూ కార్యాలయానికి తీసుకొస్తుండగా ట్రాక్టర్‌పై నుంచి కిందకు తోసేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.   కట్టుబడిని ఆస్పత్రికి తరలించి కేసు కూడా పెట్టారు. రెవెన్యూ కార్యాలయం ముందు అధికారులు, సిబ్బంది ఆందోళన చేశారు. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటనలు అనేకంగా ఉన్నట్లు సమాచారం.
 
 అంతా ఆయన చలవే...
 ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి అంతా ఆయన చలవేనన్నది బహిరంగ రహస్యం. రామాపురం గ్రామానికి ఆనుకుని ఉన్న పెన్నానదిని ఒక్కసారి పరిశీలిస్తే ఎంత కళావిహీనంగా మారిందో ఇట్టే అర్థం అవుతోంది. బుధవారం ఉదయం రామాపురం గ్రామానికి చెందిన ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఢీకొని అంగన్‌వాడీ కార్యకర్త మృతి చెందింది. ఈ సంఘటనకు అధికారుల ఉదాశీనత, అధికార పార్టీ నేత ఇసుక మాఫియాకు అండగా ఉండటమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తాను నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తానని ప్రకటించే ఓ అత్యున్నతాధికారికి ఇలాంటి ఘటనలు కనిపించవా అని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement