పట్టుకుపోతున్నా.. పట్టుకునేదెవరు?
శారదానది, ఏరుల్లో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు
సాగునీటి కట్టడాలకు పొంచి ఉన్న ముప్పు
అభివృద్ధి పనుల పేరుతో పేట్రేగుతున్న మాఫియా
జిల్లాలో నదీ వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఏరులకు వెన్నుపోటు తగులుతో ంది. ఇసుక మాఫియా యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలించేస్తోంది. శారదానది బొడ్డేరు.. తాచేరులతో పాటు పలు నదుల్లో ఎక్కడికక్కడ భారీ గోతులు తవ్వి మరీ ఇసుక తీసి పట్టుకుపోతోంది. అయినా గాని అధికారులు అటు వైపు చూడడంలేదు. అటుగా వెళ్లడంలేదు. అసలు పట్టించుకోవడంలేదు.
- చోడవరం
జిల్లాలో చోడవరం, కె.కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, కోటవురట్ల, బుచ్చెయ్యపేట, చీడికాడ మండలాల్లో శారదానదితో పాటు పలునదులు, ఏరుల్లో ఇసుక భకాసరులు చెలరేగిపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు నదుల్లో ఆయకటు రైతుల కోసం ఏర్పాటు చేసిన గ్రోయిన్లు, ఇతర కట్టడాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల అభివృద్ధి పనుల కోసం ఇంజనీరింగ్, రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. ఇందుకు స్లిప్పులు జారీ చేశారు. ఆ స్లిప్పులు ఇప్పుడు కొంప ముంచుతున్నాయి. స్లిప్పులను పట్టుకుని కొందరు మాఫియాగా ఏర్పడి ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. ఒకే స్లిప్పు మీద గుట్టుచప్పుడు పదుల సంఖ్యలో ట్రాక్టర్లపై ఇసుక పట్టుకుపోతున్నారు. స్లిప్‌లు పట్టుకొని ఇక్కడ అక్కడ అనే తేడాలేకుండా నచ్చినచోట నదుల్లో ఇసుక తవ్వేస్తున్నారు. గౌరీపట్నం, జి.జగన్నాథపురం, మల్లంపాలెం, గజపతినగరం, గోవాడ, చాకిపల్లి, బెన్నవోలు, విజయరామరాజుపేట, గవరవరం, బోయిల కింతాడ, తుమ్మపాల, కశింకోట, జంపాలెంతో తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. గ్రోయిన్లు, వంతెనలు, స్లూయీస్ ఉన్న చోట కూడా వదలకుండా ఇసుక తవ్వేస్తుండడంతో వాటికి ప్రమాదం పొంచి ఉంది. జి.జగన్నాథపురం వద్ద శారదానదిలో గ్రోయిన్‌కు ఆనుకొనే ఇసుక తవ్వకాలు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇప్పటికే నదుల్లో గ్రోయిన్లు పూర్తిగా దెబ్బతిన ఉండగా ఇప్పుడు జరుగుతున్న ఇసుక తవ్వకాలతో ఇక పూర్తిగా ధ్వంసం అయ్యే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సుమారు 70వేల ఎకరాల్లో గ్రోయిన్లు, స్లూయీస్‌లు, ఆనకట్టలపై ఆధారపడి పంటలు సాగు జరుగుతోంది.
స్లిప్పులతో దోపిడీ
నిన్నమొన్నటి వరకు అధికారిక ర్యాంప్‌ల పేరుతో వెలుగు మాటున ఇసుక అక్రమ రవాణా జరగగా ఇప్పుడు అభివృద్ధి పనులకంటూ ఎక్కడ పడితే అక్కడ ఇసుక దోపి డీ సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో ఇసుక వ్యాపారులు చెలరేగిపోతున్నారని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. అందువల్ల ఎక్కడపడితే అక్కడ ఇసుక తవ్వి పట్టుకుపోతునారని అంటున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లను అధికారులు గుర్తించి అక్కడ నుంచే నిబంధన ల మేరకు ఇసుక తరలించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తక్షణం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.