కలెక్టర్ అనుమతి ఇచ్చిన పెనుమూడి ఇసుక రేవు ఇసుకరీచ్‌లో సిద్ధం చేస్తున్న యంత్రాలు
రేపల్లె: ఆఖరి అవకాశం..తవ్వుకో.. దాచుకో..అన్నట్లు టీడీపీ నేతలు పెనుమూడి ఇసుక రేవులో దోపిడీకి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల విన్నపాలు ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ ఆలకించారు. మత్స్యసంపద తగ్గిపోవటంతో పెనుమూడిలో మత్స్యకార వృత్తినే ఆధారం చేసుకుని జీవిస్తున్న మత్స్యకారుల వెతలను జిల్లా కలెక్టర్ ఎట్టకేలకు ఆలకించారు. పెనుమూడి ఇసుక రేవులో యంత్ర సహాయం లేకుండా మాన్యువల్‌గా ఇసుకను తోడుకుని తరలించుకునేందుకు ఈ నెల 28 నుంచి మార్చి 31, 2019 వరకు నిబంధనలతో కూడిన అనుమతిని ఇస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఒక యూనిట్ ఇసుక రూ.400 వసూలు చేయాలని నిబంధనలు విధించారు.
కలెక్టర్ అనుమతితో ఇసుక రుచి మరిగిన టీడీపీ నాయకులు రేవు వద్ద ప్రత్యక్షమైయ్యారు. కార్మికులను బెదిరించి యూనిట్‌కు రూ.600 వసూలు చేస్తూ అక్రమ వసూళ్లకు తెరతీశారు. యూనిట్ ఇసుకను తీసుకువచ్చి వాహనాల్లో లోడ్ చేస్తే రూ.400 కార్మికులకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. విషయాన్ని బయటపెడితే రీచ్‌ను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అసలే చేపల వేటకు వెళ్లినా ఫలితం లేకపోవటంతో ఎక్కడ అవకాశం చేజారి పోతుందోనని చేసేది లేక మత్స్యకారులు టీడీపీ నాయకుల ఒప్పందానికి సరేనని ప్రభుత్వం నిర్ణయించిన ధరను తీసుకుని తమపని తాము చేసుకుంటున్నారు.
కార్మికుల వెతలు, ఇసుక మాఫియా అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలు
ఈ ఏడాది జూన్ 7వ తేదీన ఇసుక మాఫియా ఆగడాలపై ‘సాక్షి’లో వచ్చిన ‘ఇసుక వేట.. అవినీతి మేట’ కథనంతో అధికార యంత్రాంగ కదిలింది. అయితే ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ స్పందించడంతో అసలు ఇసుక రీచ్‌కు అనుమతి లేదని కార్మికులు ఇసుక లోడ్ చేస్తున్న ఐదు ట్రాక్టర్లను పక్కా ప్రణాళికతో సీజ్ చేయించారు. ఈ అంశంపై ‘సాక్షి’లో జూలై 20న ‘ఇసుక మాఫియా వ్యూహం’ కథనం ప్రచురించింది. ఇసుక రేవు నిలిపివేయడంతో కార్మికులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రిలో జూలై 20న ప్రత్యేక కథనం ప్రచురించింది. అప్పటి నుంచి మత్స్యకారులు జిల్లా కలెక్టర్‌ను తమ విన్నపాలను విన్నవించుకుంటుండటంతో ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి అనుమతులు అందిస్తూ ఉత్తర్వులు అందించారు.
జూన్ 2017 నుంచి జూలై 2018 వరకు కోట్లు దండుకున్న టీడీపీ నేతలు
మత్స్య కార్మికులకు గతేడాది ఇదే మాదిరి అనుమతులు అందిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన అనుమతులను టీడీపీ నేతలు అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు దండుకున్నారు. నేడు అందే విధమైన దందా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రేవులో ఇసుకను తోడేందుకు డ్రెడ్జర్లను, ఇసుకను లోడ్ చేసేందుకు యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. డ్రెజ్జర్లతో ఇసుకను తోడి యంత్రాలతో లోడ్ చేసేందుకు శరవేగం పనులు నిర్వహిస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో భారీగా ఇసుకను తరలించే అవకాశం ఉందని ఆయా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
మౌన రోదనలో మత్స్యకారులు
తమ దీన స్థితిని అర్థం చేసుకుని జిల్లా కలెక్టర్ కల్పించిన అవకాశాన్ని మాకు దూరం చేసి పొట్టకొట్ట వద్దని మత్స్య కార్మికులు వేడుకుంటున్నారు. డ్రెడ్జర్లతో ఇసుకను తోడి యంత్రాలను ఉపయోగిస్తే వివాదం చోటు చేసుకుని రీచ్‌ను నిలిపివేస్తే తమకు అన్యాయం జరుగుతుందని మౌన రోదనలో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా పెనుమూడి ఇసుక రీచ్‌లో యంత్రాల వినియోగం చేయకుండా కార్మికులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న అక్రమ దందాపై అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుని కార్మికులకు అండగా నిలవాని కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
పెనుమూడి ఇసుక రీచ్‌లో మత్స్యకారులు మాన్యువల్‌గా ఇసుకను పడవల్లో తీసుకువచ్చి తరలించుకునేందుకు జిల్లా కలెక్టర్ ఈ నెల 28 నుంచి మార్చి 31, 2019 వరకు అనుమతి ఇచ్చారు. రీచ్‌లో యంత్రాల సహాయం తీసుకోకూడదు. యూనిట్ ఇసుకకు రూ.400 మాత్రమే వసూలు చేయాలి. యూనిట్‌కు రూ.600 వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు.–ఎస్.వి.రమణకుమారి, తహసీల్దార్, రేపల్లె
ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లెం వేయాలి
నదీజాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యానికి మత్స్యసంపద తగ్గిపోయింది. మత్స్యకారుల విన్నపాలను అర్థం చేసుకున్న జిల్లా కలెక్టర్ పెనుమూడిలో పడవల ద్వారా ఇసుకను తోడి తరలించుకునేందుకు అవకాశం ఇచ్చారు. దాన్ని దెబ్బతీసే కార్యక్రమాలపై అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లెం వేసి, ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాలి. –గడ్డం రాధాకృష్ణమూర్తి, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్, రేపల్లె
Comments
Please login to add a commentAdd a comment