సాక్షి, నిజామాబాద్ : ఇసుక వ్యాపా రం కాసులు కురిపిస్తోంది. అక్రమ దందా తో కోట్లకు పడగలెత్తిన ఇసుకాసురులు రాత్రి వేళల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చీ కటి పడగానే అధిక సా మర్థ్యం కలిగిన పొక్లెయిన్లను మంజీర నదిలోకి దించి విచ్చలవిడిగా ఇసుక తవ్వుతున్నారు. ఐదారు మీటర్ల లోతులోంచి ఇసుక తోడేస్తున్నారు. తాత్కాలిక పర్మిట్ల పేరుతో సాగుతున్న పలు క్వారీల్లో సాయంత్రం ఆరు గంటలు దాటగానే ఈ వ్యవహారం మొదలవుతోంది. పంట భూముల్లో ఇసుక మేటలు వేసిందని, దానిని తవ్వుకునేందుకు రైతుల పేరుతో తాత్కాలిక పర్మిట్లు పొందిన బడా ఇసుక వ్యాపారులు రాత్రి వేళల్లో అక్రమ దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు స్థానిక చోటామోటా నేతలతో కలిసి ఇసుక దందా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం అనుమతించిన సరిహద్దుల్లో కూలీలతో మాత్రమే ఇసుక తవ్వాలి. కూలీలు తవ్విన ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చి సమీపంలో డంప్ చేసుకోవాలి. ఇలా డంప్ చేసిన ఇసుక పరిమాణాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులు వేబిల్లుల మంజురుకు సిఫార్సు చేస్తారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదు.
లక్షల రూపాయల్లో మామూళ్లు పొందిన అధికారులు ఇసుక అక్రమ దందాను అడ్డుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కో రాత్రి వందకుపైగా లారీల్లో ఇసుక అక్రమ రవాణా అవుతోంది. ఒక్కో వాహనంలో 12 నుంచి 30 టన్నుల వరకు ఇసుకను హైదరాబాద్, వరంగల్ తదితర నగరాలకు రవాణా చేస్తున్నారు. ఇలా ఒక్కో క్వారీ నుంచి రోజుకు సుమారు ఐదు నుంచి పదివేల క్యూబిక్ మీటర్ల సహజ సంపద అక్రమంగా తరలిపోతుందని అంచనా.
ఆరు చోట్ల అనుమతులు..
రెవెన్యూ అధికారులు జిల్లాలో ఆరు చోట్ల ఇసుక తవ్వకాల కోసం తాత్కాలిక అనుమతులు మంజూరు చేశారు. బిచ్కుంద మండలం పుల్కల్ శివారులోని క్వారీలో 24,443 క్యూబిక్ మీటర్లు, గుండె నెమ్లి శివారులోని మరో క్వారీలో 30,448 క్యూబిక్ మీటర్లు, వాజీద్‌నగర్ క్వారీలో 22,278 క్యూబిక్ మీటర్లు, కోటగిరి మండలం పొతంగల్ శివారులోని మరో క్వారీలో 54,956 క్యూబిక్ మీటర్లు, బీర్కూర్ మండలం బరంగెడ్గి శివారులో 29,137 క్యూబిక్ మీటర్లు, బీర్కూర్ శివారులోని క్వారీలో 62,281 క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చారు. ఇందులో బిచ్కుంద మండలం వాజీద్‌నగర్ క్వారీని కలెక్టర్ ప్రద్యుమ్న బుధవారం సీజ్ చేశారు. నిర్ణీత సరిహద్దులు దాటి నదిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నందున ఈ క్వారీ అనుమతిని రద్దు చేశారు. కాగా మరో క్వారీకి ఇచ్చిన అనుమతి రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఒక్కో క్వారీకి అనుమతి ఇవ్వడానికి గతంలో జిల్లాలోని ఓ కీలక ఉన్నతాధికారి రూ. 5 లక్షల చొప్పున పుచ్చుకున్నట్లు సమాచారం. ఒక్కరాత్రిలోనే లక్షల వ్యాపారం చేస్తున్న ఇసుక వ్యాపారులు ఆ స్థాయిలో మామూళ్లు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదని తెలుస్తోంది.
అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలతోనే..
అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న అక్రమ దందాపై కలెక్టర్ దృష్టిసారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వేళల్లో తనిఖీలు చేపడితే అక్రమాలు మరిన్ని బట్టబయలయ్యే అవకాశాలున్నాయి. ఆకస్మిక తనిఖీలకు వెళ్లేటప్పుడు ఏమాత్రం సమాచారం లీక్ అయినా.. మామూళ్లు పొందుతున్న అధికారులు, సిబ్బంది క్వారీ నిర్వాహకులను అప్రమత్తం చేస్తున్నారని సమాచారం. కలెక్టర్ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇసుకాసురులు
Published Sun, Oct 20 2013 6:41 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement