మంజీరలో ‘మహా’ అక్రమాలు
మంజీరలో ‘మహా’ అక్రమాలు
Published Tue, Sep 6 2016 10:28 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
బోధన్:
మంజీర నదిలో మహారాష్ట్ర మళ్లీ అతిక్రమణలకు పాల్పడుతోంది. మన సరిహద్దులోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేపడుతోంది. హద్దు రాళ్లను తొలగించి మరీ కాంట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. తాజాగా మన భూభాగంలో ఇసుక తవ్వుతుండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. ప్రొక్లెయిన్, టిప్పర్ సీజ్ చేశారు.
బోధన్ మండలంలోని సాలూర గ్రామ శివారులోని అంతరాష్ట్ర చెక్‌పోస్టుకు సమీపంలో మంజీర నది తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దుల మధ్య ప్రవహిస్తోంది. నదిలో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏటా ఇది వివాదాస్పదమవుతూనే ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి పేరుతో కాంట్రాక్టర్లు హద్దు దాటి మన భూబాగంలోని మంజీర నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరకు అవతలి వైపు నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్, ధర్మాబాద్ తాలూకా పరిధిలో భూభాగం ఉంది. బిలోలి తాలూకా పరిధిలోని ఎస్గీ, గంజ్‌గం, బోలేగాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు బోధన్ మండలంలోని మందర్న శివారులోని మన రాష్ట్ర సరిహద్దు రాళ్లను తొలగించి, మన భూభాగంలో ఇసుక తవ్వకాలు చేపట్టారు. సమాచారమందుకున్న బోధన్ రెవెన్యూ అధికారులు సోమవారం మందర్న శివారులో పర్యటించారు. ఇసుక తవ్వకాలను అడ్డుకొని, ప్రొక్లెయిన్, టిప్పరు స్వాధీనం చేసుకున్నారు.
‘మహా’ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతి ఇస్తున్న నేపథ్యంలో బోధన్ తహసీల్దార్ వినోద్‌కుమార్, సిబ్బంది మంజీర నది తీరంలో పర్యటించి మన రాష్ట్ర సరిహద్దులను గుర్తించి హద్దు రాళ్లను అమర్చారు. హద్దు దాటి వస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అక్కడి కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కానీ బరితెగించిన కాంట్రాక్టర్లు హద్దు రాళ్లను తొలగించి మన భూభాగంలో ఇసుక తవ్వుతున్నారు. నదిలో సరిహద్దు వివాదాన్ని ఆసరా చేసుకుని మితిమీరుతున్నారు. వారికి ‘మహా’ సర్కారు అండగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
సరిహద్దులో ఇసుక జాతర..
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్ మండలంలోని సాలూర అంతరాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలో ఇసుక లారీలు బారులు తీరుతున్నాయి. వందల సంఖ్యలో లారీల రాకపోకలతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు 200 పైగా ఇసుక లారీలు, టిప్పర్ల ద్వారా ఇసు రవాణా సాగుతోంది. సాలూర చెక్‌పోస్టు నుంచి బోధన్ వరకు రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. మహారాష్ట్ర ఇసుక క్వారీలతో అక్కడి ప్రభుత్వం, కాంట్రాక్టర్లు రూ.కోట్ల ఆదాయం దండుకుంటున్నారు. నకిలీ వేబిల్లుతో ఇసుక తరలిపోతోందని ఆరోపణలు వచ్చినా తనిఖీలు మాత్రం ‘మామూలు’గా కొనసాగుతున్నాయి.
క్రిమినల్ కేసులు పెడతాం..
మహారాష్ట్రలోని బోలేగాం ఇసుక క్వారీ నిర్వాహకులు మన భూభాగంలో చొచ్చుకు వచ్చి హద్దు రాళ్లను తొలగించి ఇసుక తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలను అడ్డుకొని ప్రొక్లెయిన్, టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు అందించాం. మంజీర నదిలో హద్దులు దాటి ఇసుక తవ్వకాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– వినోద్‌కుమార్, తహసీల్దార్
Advertisement
Advertisement