‘మహా’ ఇసుకపై మనోళ్ల కన్ను
Published Fri, Sep 23 2016 11:50 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
పది రీచ్‌లకు టెండర్లు పిలిచిన గడ్చిరోలి అధికారులు
తెలంగాణలో టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలతో వీరి దందాకు చెక్
ఇక్కడ దందాకు వీలు లేక మహారాష్ట్ర రీచ్‌లపై ఆసక్తి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మన ఇసుక కాంట్రాక్టర్ల కన్ను ఇప్పుడు మహారాష్ట్ర ఇసుక రీచ్‌లపై పడింది. రాష్ట్రంలో టీఎస్‌ఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో ఇక్కడి ఇసుక కాంట్రాక్టర్ల ఆటలు దాదాపు సాగడం లేదు. దీంతో ఇసుక నుంచి కాసులు పిండుకోవడానికి అలవాటు పడిన ఈ కాంట్రాక్టర్లు ఇప్పుడు మహారాష్ట్ర ఇసుక రీచ్‌లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గోదావరి అవతల వైపు ఉన్న రీచ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లు పిలిచింది. గడ్చిరోలి జిల్లా సిర్వంచా తాలుకాలోని సుమారు పది ఇసుక రీచ్‌లకు అక్కడి కలెక్టర్ కార్యాలయం టెండర్లు ఆహ్వానించింది. సుమారు 12 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు రూ.44 కోట్లుతో టెండర్లను ఆహ్వానించింది. దీంతో ఆదిలాబాద్ తూర్పు ప్రాంతానికి చెందిన ఇసుక కాంట్రాక్టర్లు ఈ రీచ్‌లను దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 26 వరకు ఈ టెండర్లకు గడువుండటంతో ఈ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గోదావరి నీటి ప్రవాహం ప్రస్తుతం పెరిగింది. అయినప్పటికీ చాలా చోట్ల నీటి ప్రవాహం అంతగా లేదు. ఇలా నీటి ప్రవాహం లేనిచోట్ల ఈ తవ్వకాలకు అక్కడి ప్రభుత్వం తెర లేపింది. ప్రస్తుతం జిల్లాలో ఇసుక తవ్వకాలు అంతగా లేవు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ (టీఎస్‌ఎండీసీ) ద్వారానే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పట్టా భూముల్లో అక్కడక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులున్నప్పటికీ, ప్రస్తుతానికి ఈ క్వారీల్లో కూడా తవ్వకాలు నామమాత్రంగా సాగుతున్నాయి. దీంతో ఇసుకాసురులు తమకు ఇక్కడ ప్రయోజనం లేదని భావించారు. సిర్వాంచ నుంచి కాళేశ్వరం ప్రాంతం మీదుగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పట్టణాలకు ఇసుక తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వారి పేరుతో ఈ రీచ్‌లను దక్కించుకుని ఇసుక మాత్రం రాష్ట్రంలో విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం బహిరంగ వేలం ద్వారా ఇసుక రీచ్‌లను కేటాయిస్తుంది. ఇందులో భాగంగానే సిర్వాంచ తాలూకా పరిధిలోని నగరం వంటి ప్రాంతాల్లో మొత్తం పది రీచ్‌లకు బహిరంగ వేలం నిర్వహిస్తోంది.
Advertisement