ఇసుక దుమారం..! | Sand storm in parvathipuram | Sakshi
Sakshi News home page

ఇసుక దుమారం..!

Published Sun, Nov 2 2014 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

ఇసుక దుమారం..! - Sakshi

ఇసుక దుమారం..!

 చినుకు..చినుకు..వానగా మారినట్లు.. వాన వర దగా రూపొందినట్లు..వరద బీభత్సం సృష్టించినట్లు..వివిధ  నిర్మాణాలలో ముఖ్య భూమిక పోషించే ఇసుకపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒకరికొకరుగా వంద లాది మంది ఏకమై భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు.  భవన నిర్మాణ కార్మికులు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల సంఘాలు, నాటు బళ్ల సంఘాలు, తాపీ పనివారలు, రాడ్ బెండర్లు, కర్రపనివారలు, విద్యుత్ కార్మికులు, ఇనుప బళ్ల యజమానులు,  టైల్స్, మార్బుల్, ఫ్లోరింగ్ పనివారలు, లోడింగ్, అన్‌లోడింగ్ కూలీలు తదితర సంఘాలకు చెందిన వారు పార్వతీపురం పట్టణంలో  కదం తొక్కారు.
 
 పార్వతీపురం: సీపీఎం, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణం, మండలం, కొమరాడ, గరుగుబిల్లి తదితర మండలాలకు చెందిన వందలాది మంది  తొలుత పాతబస్టాండ్ రాయగడ రోడ్డులోని శ్రీ సీతారామ స్వామి దేవాలయం నుంచి పట్టణ మెయిన్ రోడ్డులో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్‌కు చేరుకుని రాస్తారోకో, ధర్నా, మానవహారం  నిర్విహ ంచారు. నాలుగు రోడ్లను నిర్బంధించి కాంప్లెక్స్ నుంచి బస్సులు కదలకుండా, ఇరువైపులా వాహనాల రాకపోకలు సాగకుండా అడ్డుకున్నారు. ఈసందర్భంగా ఆయా సంఘాలకు చెందిన నాయకులు రెడ్డి శ్రీరామమూర్తి, జివి సన్యాసి, పి.సత్యనారాయణ తదితరులు  మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక రీచ్‌ల నిర్వహణ మహిళా సంఘాల పేరుతో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అప్పగించి, భరించలేని ధరలు పెట్టి ప్రజా కంటక నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు.
 
 ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం ఈ ప్రాంతంలో ఎవరూ ఇసుక కొనలేరని, భవన నిర్మాణాలు చేపట్టలేరని ఆందోళన వెలిబుచ్చారు. నిరుపేదలు ఇళ్లు కట్టుకోలేని దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కార్పొరేట్ స్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారని, పేదల గురించి కూడా ఆలోచిస్తే అంతగా ధరలుండవని హితవు పలికారు.  భవన నిర్మాణాలు లే కపోతే వాటిపై ఆధారపడిన వివిధ వృత్తి పనివారలు గత మూడు నెలలుగా పనులు లేక పస్తులుంటున్నారని  ఆవేదన వెళ్లగక్కారు. ఇప్పటికే వేలాది మంది విశాఖ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పనులు వెదుక్కుంటూ వెళ్తున్నారన్నారు.
 
 ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ప్రాంతమంతా ఖాళీ అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతి రేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సబ్-కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. తరువాత  ఆ కార్యాలయం ఏఓ టి.రామకృష్ణారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ఎస్సైలు బి.సురేంద్రనాయుడు, సాంబశివరావు తదితరులు తమ సిబ్బందితో పర్యవేక్షించారు. ధర్నా కార్యక్రమంలో కొత్తపోలమ్మ భవన నిర్మాణ కార్మిక సంఘం, సోమేశ్వర విజయదుర్గ, జగన్నాథ విజయదుర్గ ట్రాక్టర్ల యజమానుల సంఘాలు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. దీంతోపాటు పార్వతీదేవి కార్పెంటర్ల సంఘం తదితర సంఘాలు పాల్గొన్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement