శృంగవరపుకోట: ఇసుక కొరత రానీయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకుంటోంది. అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న నిర్ణయంతో ఎంతోమందికి మేలు కలగనుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానుంది.
భారీగా తగ్గనున్న ధరలు
జిల్లాలో 80 ఇసుక రీచ్‌లు ఉండగా ఇవన్నీ 1 నుంచి 3 స్ట్రీమ్స్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం 34 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇప్పటి వరకూ టాక్టర్‌తో ఇసుక తరలించాలంటే ప్రభుత్వానికి రూ.1300లు చలానా కట్టాల్సి వచ్చేది. టైరు బండ్లు మాదిరిగా ట్రాక్టర్లతో ఇసుక రవాణాకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని తాజా ఉత్తర్వుల్లో తేల్చడంతో భారీగా ధర తగ్గనుంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1000 నుంచి 1500లు మొత్తం రూ3500 నుంచి 4000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇకపై చలానా ధర తగ్గడంతో వినియోగదారునికి వెసులుబాటు కలగనుంది.
తాజా మార్గదర్శకాలు
-వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్–1లో ఇసుక కోసం దరఖాస్తు చేయాలి. ∙24 గంటల్లో అర్జీని పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్‌ను సమయం, తేదీలతో ఇస్తారు. ఇసుకను రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు.
-ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి.
-గ్రామకార్యదర్శి ఇసుక పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలి. 1నుంచి 3స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్ 4, 5 స్ట్రీమ్స్ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌యార్డుల ద్వారా సరఫరా చేస్తారు.
లోడింగ్ చార్జీల భారం తగ్గాలి
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న పలు రీచ్‌లలో ట్రాక్టర్ లోడింగ్‌కు రూ. 800 నుంచి 1000లు వసూ లు చేస్తున్నారు. గతంలో లోడింగ్ చార్జీలు రూ.400లే ఉండేది. క్రమంగా ఇసుకకు డిమాండ్ పెరగటంతో లోడింగ్ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం లోడింగ్‌కు టన్నుకు రూ.90లు చొప్పున ట్రాక్టర్ (4.5టన్నులు)కు రూ.405లు తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లోడింగ్ చార్జీలపై నియంత్రణ లేక పోవటంతో ఇసుక ధర తగ్గటం లేదు. ఇదే తీరుగా వినియోగదారుల అవసరాలను ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల అవసరాలు తీర్చటం కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1300లు భారం తగ్గింది.
సామాన్యులకు అందుబాటు..
ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రాక్టర్లను రూ.1300లు చలానా నుంచి మినహాయించారు. జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న 34రీచ్‌ల నుంచి ఎక్కడైనా నిబంధనలకు లోబడి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. శుక్రవారం నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.405లు తీసుకోవాలి. అధిక వసూళ్లపై జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదిస్తాం.
– కర్రా ప్రవీణ్‌కుమార్, జిల్లా ఇసుక సహాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment