ఆరడుగుల బుల్లెట్ వైజాగ్ విసిరిన రాకెట్
- ఆసియాడ్‌లో సాకేత్‌కు స్వర్ణం
విశాఖపట్నం : ‘కృష్ణా జిల్లా వుయ్యూరులో పుట్టాను.. వైజాగ్‌లో పెరిగాను.. ఈ సాగర తీర నగర సౌందర్యం అద్వితీయం. అపురూపం. సహజమైన హార్బర్‌తో అలరారే ఈ నగరం నా టెన్నిస్‌కు ఎంతగానో దోహదపడింది.’
ఆరడుగుల బుల్లెట్ వంటి టెన్నిస్ సంచలన కెరటం సాకేత్ సాయి మైనేని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైజాగ్ గురించి చెప్పిన ఆత్మీయ సంగతులివి..
ఎవరనుకున్నారు విశాఖ కుర్రాడు సాకేత్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని! ఎవరు కలగన్నారు ఈ ఆరడుగుల నాలుగంగుళాల యువకుడు ఇలా దుమ్ము రేపుతాడని! ఆసియాడ్‌లో ఓ స్వర్ణాన్ని , ఓ రజతాన్ని హస్తగతం చేసుకుని ఇంత చరిత్ర సృష్టిస్తాడని! అయితే, కెరీర్ తొలి దినాల్లో నిశ్శబ్దంగా చిరుతలా దూసుకుపోయిన ఈ కుర్రాడి ఆటను చూసిన నిపుణులు అప్పట్లోనే అనుకున్నారు.. ఇతనేదో సాధిస్తాడని! ఏడో తరగతి చదువుతున్నప్పుడు టెన్నిస్ రాకెట్ చేతపట్టి కోచ్ కిషోర్ కనుసన్నల్లో రాటుదేలిన ఈ ప్రతిభావంతుడి ఆట చూసిన వాళ్లు పసిగట్టారు..
ఈ యూత్‌స్టార్‌లో మేటి ఆటగాడు దాగున్నాడని! వాళ్ల నమ్మకాన్ని సాకేత్ వమ్ము చేయలేదు.. భారత్‌లోనే నంబర్ టూ ర్యాంకింగ్ ఉన్న ఆటగాడిగా ఎదిగాడు. ఐటీఎఫ్ ప్రో సర్క్యూట్‌లో ఎనిమిది సింగిల్స్, తొమ్మిది డబుల్స్ టైటిల్స్ సాధించి పాతికేళ్ల ప్రాయంలోనే 300 ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇప్పుడు అమెరికాలో శిక్షణ పొందే స్థాయికి చేరుకున్నాడు. అన్నిటికీ మించి ఆసియాడ్‌లో భారత్‌కు ఓ స్వర్ణాన్ని, రజతాన్ని అందించి విశాఖ ఖ్యాతిని క్రీడాగగనంలో రెపరెపలాడించాడు.
తొలి అడుగులివీ..
సర్వీస్ చేయడం నేర్పిన స్థానిక కోచ్ కిషోర్ శిక్షణలో నేర్పు సాధించిన సాకేత్ రాకెట్ పట్టిన రెండేళ్లలోనే స్థానిక కుర్రాళ్లను చిత్తు చేయడం మొదలెట్టాడు. ఆ స్థాయిలో నాకింగ్ చేసేందుకు సమ ఉజ్జీగా నిలిచే ఆటగాళ్లు లేకపోవడంతో మకాం హైదరాబాద్‌కు మార్చాడు. తండ్రి ప్రసాద్ సైతం వ్యాపారరీత్యా విశాఖకు దూరమైనా సర్యూట్స్ టోర్నీలో, తలపడేందుకు సాకేత్‌కు చక్కటి తోడ్పాటునందించాడు.
ఏడాదిన్నరగా యూఎస్‌లో శిక్షణ తీసుకుంటూనే ఆసియాడ్‌లో అద్భుతం సాధించాడు. దాదాపు ఆరున్నర అడుగుల ఎత్తున్న సాకేత్ అటు ఫోర్‌హాండ్, బ్యాక్ హాండ్‌ల్లో అదరగొట్టే ప్రతిభ సాధించాడు. బేసిక్స్ విశాఖలో నేర్చుకున్నా... తర్వాత హైదరాబాద్‌లో, ఇప్పుడు యూఎస్‌లో మెలకువలు నేర్చుకుంటున్నాడు.
మంత్రి గంటా అభినందనలు
టెన్నిస్‌లో బంగారం పతకాన్ని సాధించిన సాకేత్‌కు లాన్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. అసోసియేషన్ తరపునే కాకుండా ప్రభుత్వ పరంగా సాకేత్‌కు అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సాకేత్‌కు అభినందనలు తెలిపారు.