రాజన్న పారిశుధ్య చేయూత ఆటోలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు(సెంట్రల్): నగర వాసులకు ఎలాంటి పారిశుధ్య సమస్య రాకుండా ఉండేందుకు తన సొంత నిధులతో రాజన్న పారిశుధ్య చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించానని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో రాజన్న పారిశుధ్య చేయూత ఆటోలను శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజాదీవెనలో భాగంగా ఇటీవల తాను నగర నియోజకవర్గంలో గడప గడపకూ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నానని, కార్పొరేషన్ వాళ్లు కాలువల్లో పూడికతీయడం లేదని, చెత్తను తొలగించడం లేదని 80 శాతం మంది తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని నాలుగన్నరేళ్లుగా అనేకమార్లు తెలిపినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తన వంతుగా ఆరు ఆటోలు, 100 మంది సిబ్బందిని నియమించానని వెల్లడించారు. 84484 45526 నంబర్‌కు సమస్యను తెలియజేస్తే, 24 గంటల్లో పరిష్కరిస్తామని ప్రకటించారు.
విమర్శలు మానుకోవాలి
తాను ప్రజల తరఫున వారి సమస్యలపై మాట్లాడుతుంటే కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆరు ఆటోలు, 100 మంది కార్మికులను ఏర్పాటు చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుందన్నారు. నగరంలో మెరుగైన పారిశుధ్యం అందించగలిగితే తాము ఇచ్చిన నంబర్ ఎవరీకి అవసరం ఉండదనే విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని కోరారు. తాము నియమించిన కార్మికులు నగరంలో పనిచేస్తున్నారంటే పారిశుధ్య విషయంలో పాలకులు, ప్రభుత్వం విఫలమైనట్లేనని చెప్పారు. నగరవాసులకు మెరుగైన పారిశుధ్యాన్ని అందించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నానని తెలిపారు. తొలుత గాంధీబొమ్మ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడే జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు కేక్‌ను కట్ చేశారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, రూప్‌కుమార్‌యాదవ్, వేలూరు సుధారాణి, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, గోగుల నాగరాజు, ఖలీల్ అహ్మద్, వందవాసి రంగ, కొణిదల సుధీర్, కర్తం ప్రతాప్‌రెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, సంక్రాంతి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment