వల్లకాడే ఊరు.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు | Poor People Lives At Nellore Urban Bodigadi Peta Graveyard | Sakshi
Sakshi News home page

వల్లకాడే ఊరు.. శ్మశానంలో కాపురాలు.. సమాధులే పట్టు పరుపులు

Published Tue, Oct 5 2021 7:01 PM | Last Updated on Tue, Oct 5 2021 10:01 PM

Poor People Lives At Nellore Urban Bodigadi Peta Graveyard - Sakshi

నెల్లూరు(అర్బన్‌): అక్షరం ముక్క రాని అభాగ్యులు. దారిద్ర్యంలో అతి దరిద్రులు. నిత్యం శవాల కాలే చమురు వాసనలే వారికి సువాసనలు. మనిషి పుర్రెలతోనే పసిబిడ్డలు ఆటలాడుకుంటారు. సమాధులే వారికి పట్టు పరుపులు.. ఉండేందుకు జానెడు జాగా లేక వల్లకాడు(శ్మశానం)లోనే దశాబ్ధాల తరబడి కాపురాలు ఉంటున్నారు. ఇదంతా ఎక్కడో కాదు. విక్రమసింహపురిగా ఖ్యాతి గాంచిన నెల్లూరు బోడిగాడితోట శ్మశానంలో కాపురాలుంటున్న నిరుపేదల దయనీయ స్థితి. 

నెల్లూరు పెన్నానది ఒడ్డున విశాలమైన బోడిగాడితోట హిందువుల అతిపెద్ద  శ్మశాన వాటిక. సుమారు 8 లక్షల జనాభ ఉండే నగరంలో మనిషి మరణిస్తే ఎక్కువ భాగం బోడిగాడితోటలోనే ఖననం చేస్తారు. ఆ శ్మశాన వాటికను ఆనుకుని ఒక వైపు పెద్ద, పెద్ద భవంతులున్నాయి. ఎంతో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయి. శ్రీమంతులున్నారు.  మరో వైపు నివాస స్థలం లేకపోవడంతో  శ్మశానంలో సమాధులనే ఇళ్లుగా చేసుకుని పట్టలు కట్టుకుని, పూరి కప్పు వేసుకుని నివసించే వందలాది కుటుంబాలున్నాయి. వీరి బాధలు చూసిన వారి మనస్సు చివుక్కు మనిపించక మానదు. జానెడు పొట్ట నింపుకునేందుకు ఇన్ని బాధలా.. ఇంత దుర్భరమైన బతుకా అని మనస్సు కలత చెందడం ఖాయం.
(చదవండి: బతికుండగానే సమాధి.. దానికో కిటికి.. ఏమా రహస్యం)

బతుకు దుర్భరం 
ఈ శ్మశానంలో సుమారు 500 కుటుంబాల వరకు నివసిస్తున్నాయి. చిన్న పూరింట్లోనే నలుగురైదుగురు నివాసం ఉంటున్నారు. ఇక్కడ ఉంటున్న వీరు వారి తాత, ముత్తాతల కాలంలో ఇక్కడికి వలస వచ్చారు. అందరూ తమిళం మాట్లాడుతారు. వీరిలో ఎక్కువ భాగం చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఏరుకోవడం వాటిని అమ్ముకోవడం ద్వారానే బతుకు బండి లాగిస్తున్నారు. మరికొంతమంది మంది మహిళలు వీధి, వీధి తిరుగుతూ  చిక్కు వెంట్రుకలు సేకరించి వాటిని అమ్మడం చేస్తారు. ఇంకొంతమంది ఇళ్లలో పాచి పని చేసి బతుకీడిస్తున్నారు. వచ్చే అరకొర సంపాదనతో ఏపూటకాపూట బతుకుతున్నారు. 
(చదవండి: శ్మశానాన్ని కాపాడలేని ఈ బతుకు ఎందుకు!!)

ఇది చాలదన్నట్టు చదువు సంధ్య లేని వారు కావడంతో మద్యం లాంటి అలవాట్లతో ఎదుగూ బొదుగూ లేకుండా జీవిస్తున్నారు. వర్షం వస్తే వారి బాధలు వర్ణనాతీతం. ఒక వైపు తడుస్తూ.. మరో వైపు పనులు లేక పస్తులతో గడుపుతుంటారు. జబ్బు చేస్తే దవాఖానాకు పోయేందుకు పైసలు లేక అల్లాడి పోతుంటారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్ధాలు అవుతున్నా వారికి చీకటి బతుకుల్లో వెలుగు రావడం లేదు.
(చదవండి: కర్రకు ప్రాణం.. కళకు రూపం)

తమ ఓట్లు పొందుతున్న నాయకులు తమకు పక్కా ఇళ్లు కల్పించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి బాధలు స్వయంగా పరిశీలించిన నెల్లూరు సిటి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వారికి టిడ్కో ఇళ్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురికి ప్రభుత్వం ద్వారా హౌసింగ్‌బోర్డు కాలని వద్ద  టిడ్కో ఇళ్లు కట్టించి ఇవ్వడంతో కొంతమంది ఆ ఇళ్లలోకి కాపురం మార్చారు. 

త్వరగా పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి: శాంతి, స్థానికురాలు 
మాతాత, ముత్తాతల నుంచి తాము ఇక్కడే నివాసం ఉంటున్నాం. మా బిడ్డలకు కూడా పెళ్లిళ్లు చేశాం. ఘోరిల మధ్యనే ఉంటున్నాం. కడుబీదరికంలో బతుకుతున్నాం. ప్రభుత్వం  కొంతమందికి ఇళ్లు కట్టించింది. వారు వెళ్లారు. మిగతా వారికి కూడా ఇళ్లు కట్టిస్తామంటున్నారు. త్వరగా ఇళ్లు కట్టించి ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి వెళ్తాం.

చదవండి: విధి ఆట.. గెలుపు బాట


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement