అమ్మో ఆస్పత్రా..! | Sanitation workers IN Hospitals | Sakshi
Sakshi News home page

అమ్మో ఆస్పత్రా..!

Published Mon, Jan 4 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

Sanitation workers IN Hospitals

 పిచ్చి మొక్కలతో ఆధ్వానంగా
 దర్శనమిస్తున్న వైద్యాలయాలు
 అడుగడుగునా పారిశుద్ధ్య లోపం
 పూర్తిస్థాయిలో లేని
 పారిశుద్ధ్య సిబ్బంది
 అటకెక్కిన స్వచ్ఛభారత్
 ఆందోళన చెందుతున్న రోగులు
 
 విజయనగరంఫోర్ట్: ఆస్పత్రులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే కార్యక్రమం అరంభంలో ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యాధికారులు స్వచ్ఛభారత్ అంటూ  అర్భాటం చేశారు. ఆతర్వాత ఆ ఊసే ఎత్తడం మానేశారు. దీంతో ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య లోపం రాజ్యమేలుతోంది. జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 11 సీహెచ్‌సీలు, 8 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 7 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులు ఉన్నాయి.  అన్ని ఆస్పత్రుల్లోనూ ఒకటి, రెండు రోజుల పాటు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టి చెత్తాచెదారాన్ని తొలగించారు. ఆతర్వాత పట్టించుకోకపోవడం వల్ల పీహెచ్‌సీల్లోను, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లోను,   ఏపీవీపీ ఆస్పత్రుల్లోను  పరిసరాలు  ఆధ్వానంగా  తయారయ్యాయి.  ఆస్పత్రుల ఆవరణల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోయాయి. ఆస్పత్రులు పిచ్చిమొక్కలతో నిండిపోవడంతో విషసర్పాలు ప్రవేశిస్తాయని రోగులు ఆందోళన చెందుతున్నారు.
 
 మాసిన బెడ్‌షీట్సే
 రోగులకు ఆస్పత్రుల్లో మాసిపోయిన బెడ్‌షీట్సే దిక్కవుతున్నాయి. రోజు విడిచి రోజు బెడ్‌షీట్స్ మార్చాల్సి ఉన్నప్పటికీ,  నాలుగు,ఐదు రోజులకు గాని బెడ్‌షీట్స్ మార్చడం లేదు. దీంతో రోగులు మాసిన బెడ్‌షీట్స్‌పైనే చికిత్స పొందుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో బెడ్‌షీట్స్ ఇవ్వకపోవడంతో ఇంటినుంచి  దుప్పట్లు తెచ్చుకుని వేసుకుంటున్నారు.
 
 పరిశుభ్రత కను‘మరుగు’
 ఆస్పత్రుల్లో మరుగుదొడ్లలో పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని  ఆస్పత్రుల్లో మరుగుదొడ్లను రోజుల తరబడి శుభ్రప ర చకపోవడం వల్ల కంపు కొడుతున్నాయి. మరి కొన్ని ఆస్పత్రుల్లో మరుగుదొడ్ల డోర్లు పాడయ్యాయి.
 
 గచ్చుల శుభ్రత  రోజుకొకసారే
 ఆస్పత్రుల్లో  గచ్చులను ఉదయం, సాయంత్రం శుభ్ర పరచాలి. అయితే ఉదయం పూట మాత్రమే  శుభ్రపరుస్తున్నారు.  కొన్ని ఆస్పత్రులకు స్వీపర్ కూడా లేకపోవడంతో వైద్య సిబ్బందే తుడుచుకుంటున్న పరిస్థితి.
 
 తీరని దాహం
 జిల్లాలో  కొన్ని ఆస్పత్రుల్లో రోగులు, సిబ్బంది తాగడానికి నీళ్లు కూడా లేవు. దీంతో  ఆస్పత్రి సిబ్బంది తాగునీటి కొళాయిల వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు.
 
 విచ్చలవిడిగా పందుల విహారం
 జిల్లాలో  కొన్ని ఆస్పత్రులకు ప్రహరీలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రంలోని కేంద్రాస్పత్రి, ఘోషాఆస్పత్రుల్లో పందులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.
 
 రూ.లక్షల్లో వెచ్చిస్తున్నా మెరుగుపడని పారిశుద్ధ్యం
 వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా మెరుగు పడడం లేదు. కేంద్రాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు 43 మంది ఉండాల్సి ఉండగా 30 మందే ఉన్నారు.దీంతో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టలేకపోతు న్నారు. ఘోషాఆస్పత్రిలో 30 మంది ఉండాల్సి ఉండగా 15 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా పారిశుద్ధ్య పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు.  దీనిని బట్టి పీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో పరిస్థితి  ఏవిధంగా ఉంటోందో అర్థం చేసుకోచ్చు.
 
 పీహెచ్‌సీలకు విడుదలకాని హెచ్‌డీఎస్‌ఫండ్స్
 జిల్లాలో 68 పీహెచ్‌సీలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ(హెచ్‌డీఎస్‌ఫండ్స్) నిధులు పీహెచ్‌సీలకు  ఇంకా విడుదల  కాలేదు. ఒక్కో పీహెచ్‌సీకి ఏడాదికి   రూ.2.50 లక్షలు వరకు విడదలవుతాయి. ఈ నిధులతో పీహెచ్‌సీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. నిధులు విడుదల కాక పీహెచ్‌సీలు అభివృద్ధికి నోచుకోక పరిస్థితి దారుణంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement