పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భోజనం తనిఖీ చేస్తున్న కో ఆర్డినేటర్ ప్రియాంక
సాక్షి, విజయనగరం : డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పోరేట్ వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రులు కూడా నిబంధనలకు అనుగుణంగా రోగులకు వైద్య సేవలు అందించాలి. రోగులకు మౌలిక సౌకర్యాలు కూడా కల్పించాలి. కాని కొన్ని ఆస్పత్రులు నిబంధనలు పాటించడం లేదు. దీంతో ఆరోగ్యశ్రీ అధికారులు నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, భోజనం సక్రమంగా లేని ఐదు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు.
కల్పించాల్సిన సౌకర్యాలు..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స లేదా శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు వైద్య పరీక్షలు, ఈసీజీ, స్కానింగ్, ఎక్సరే, తదితర అన్ని సేవ లు ఉచితంగా అందించాలి. ఆరోగ్యశ్రీ రోగులు చికిత్స పొందే ఇన్‌పేషేంట్ వార్డు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. బెడ్స్, బెడ్‌షీట్స్ పరిశుభ్రంగా ఉండాలి. అన్నింటి కంటే ముఖ్యంగా మంచి భోజనం అందించాలి. ఆకుకూరలు, ప ప్పు, పండు, పెరుగు, గుడ్డు, అన్నం, సాంబారుతో కూడిన మంచి భోజనాన్ని రోగులకు పె ట్టాలి. ఒక వేళ సంబంధిత ఆస్పత్రిలో స్కా నింగ్ లేదా ఎక్సరే, బయాప్సీ వంటి పరీక్షలు బయట స్కానింగ్ సెంటర్‌లో చేయించినట్లైతే తక్షణమే వాటి బిల్లులు రోగికి చెల్లించాలి.
29 ఆస్పత్రులు..
జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకం గుర్తింపు ఉన్న ఆస్పత్రులు 29 ఉన్నాయి. వీటిల్లో 15 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా భోజనం కూడా చాలా ఆస్పత్రుల్లో నాణ్యంగా లేదని ఆరోగ్యశ్రీ అధికారులు గుర్తించారు. దీంతో ఐదు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు. పారిశుద్ధ్యం, భోజనం సక్రమంగా లేని మూడు ఆస్పత్రులకు, భోజనం సక్రమంగా లేదని మరో రెండు ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశారు.
ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు
పుష్పగిరి కంటి ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి (ఎస్.కోట), మిమ్స్ ఆస్పత్రి ( నెల్లిమర్ల), తిరుమల నర్సింగ్ హోమ్, ఆంధ్ర ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, శ్రీ సాయి సూపర్ స్పెషాలటీ, శ్రీ సాయి పీవీఆర్ ఆస్పత్రి, మువ్వ గోపాల ఆస్పత్రి, అభినవ్ నర్సింగ్ హోమ్ (ఎస్.కోట), వరుణ్ డెంటల్ ఆస్పత్రి, ఆపిల్ డెంటల్ ఆస్పత్రి, విజయ డెంటల్ ఆస్పత్రి, బీఎస్‌ఆర్ ఈఎన్‌టీ డెంటల్ ఆస్పత్రి, స్వామి కంటి ఆస్పత్రి ఉన్నాయి.
ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వాస్పత్రులు
కేంద్రాస్పత్రి, ఎస్.కోట ఏరియా ఆస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రి, నెల్లిమర్ల, బొబ్బిలి, భోగాపురం, చీపురుపల్లి, సాలురు, కురుపాం, భద్రగిరి సీహెచ్‌సీలతో పాటు చినమేరంగి, బాడండి ఆస్పత్రులున్నాయి.
చర్యలు తప్పవు..
ఆరోగ్యశ్రీ పథకం ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. రోగులకు నాణ్యమైన భోజనం పెట్టాలి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు పాటించని ఐదు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులకు నోటీస్‌లు జారీ చేశాం.
– డాక్టర్ పి. ప్రియాంక, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్.
Comments
Please login to add a commentAdd a comment