సంకిలి సొసైటీ సీఈఓ సస్పెన్షన్
Published Mon, Jan 20 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
సంకిలి(రేగిడి), న్యూస్‌లైన్: మండల పరిధిలోని సంకిలి సొసైటీ సీఈఓగా పనిచేస్తున్న కంబాల సింహాచలంను సస్పెండ్ చేశామని సొసైటీ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీకి చెందిన రూ. 2.15 లక్షలు బ్యాంకులో జమచేయకుండా తన వద్దే ఉంచుకున్నాడని ఆరోపించారు. అలాగే, ఆయన గతంలో అటెండర్‌గా విధులు నిర్వహించేవాడని, 31-07-2009న సొసైటీకి ఇన్‌చార్జి సీఈఓగా బోర్డు నియమించిందన్నారు. ఆయన పనిచేస్తున్న అటెండర్ ఉద్యోగానికి సంబంధించిన జీతం రూ. 3500లు కాగా సీఈఓకు సంబంధించిన జీతాన్ని రూ. 12200లు చొప్పున సొసైటీ నుంచి తీసుకుంటున్నాడని శ్రీనివాసరావు వెల్లడించారు.
ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినంత మాత్రాన జీతం పెరగదని పేర్కొన్నారు. ఈ నెల 11న సొసైటీకి సంబంధించిన రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయని పేర్కొన్నారు. సొసైటీకి సంబంధించి స్టాకు రికార్డులను కూడా పరిశీలించగా ఎరువులు స్టాకు ఉన్నట్లు రికార్డుల్లో రాసారని, ఎరువులు మాత్రం సొసైటీలో లేవన్నారు. ఈ విషయంపై సింహాచలానికి సొసైటీ ద్వారా నోటీసులు జారీచేశామని వివరించారు. పది రోజుల్లో తన వద్ద ఉన్న మొత్తాన్ని లిఖితపూర్వకంగారాసి ఇచ్చినా సొసైటీలో ఆర్థిక లావాదేవీలతోపాటు అక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగి అవసరం లేదనే ఉద్దేశంతోనే సస్పెండ్ చేశామన్నారు. ఈ విషయాన్ని పాలకమండలి సమావేశంలో కూడా చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Advertisement
Advertisement