చీరాలలో కాపుసారా తయారు చేస్తున్న దృశ్యం
చీరాల: ‘‘జిల్లాలో నాటు సారా తయారీ, అమ్మకాలు లేవు. ఎక్కడా సారా ఆచూకీ లేదు. ఎక్సైజ్ అధికారుల పనితీరు భేష్. సారా రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటిస్తున్నాం’’ అని అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. కానీ చీరాలతో పాటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం ప్రాంతాల్లో జోరుగా సారా తయారు చేయడంతో పాటు విక్రయిస్తున్నారు. జిల్లాలో నాటు సారా లభించని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు చీరాలకు మరో పేరు క్షీరపురి. అంటే ఒకప్పుడు పాడిపరిశ్రమతో పాలవెల్లువ కనిపించేపరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఆ స్థానంలో సారా వెల్లువగా మారింది. చీరాల ప్రాంతంలో ఎక్కువగా నివసించేది బడుగు, బలహీన వర్గాల వారే. కాయకష్టం చేసుకుని బతుకులు సాగిస్తుంటారు. పని ఒత్తిళ్లు, మరో ఇతర కారణాల వలన మద్యం మత్తుకు ఎక్కువ మంది బానిసలవుతున్నారు. కూలీ, నాలీ చేసుకుని బతికే ఈ వర్గాలు మద్యం కొనుగోలు చేసి తాగే ఆర్థిక స్థోమత లేక ప్రత్యామ్నాయ మార్గంగా సారా వైపు మళ్లారు. దీంతో కొన్నేళ్లుగా చీరాల ప్రాంతంలో సారా పరవళ్లు తొక్కుతోంది. చీరాలకు కూతవేటు దూరంలో అంటే ఐదు కిలోమీటర్లలోపే గుంటూరు జిల్లా స్టువర్టుపురం మందుబాబులతో కోలాహలంగా ఉంటుంది. కడుపునిండా తాగి తమతో కలిసి మద్యం తాగే వారికి పార్శిల్ రూపంలో కొనుగోలు చేసి రైళ్లలో రోజూ తెస్తుంటారు. వేటపాలెం, పందిళ్లపల్లి, జాండ్రపేట, రామకృష్ణాపురం, చీరాల, ఈపూరుపాలెంతో పాటు చినగంజాం, పలు ప్రాంతాల నుంచి రోజూ స్టువర్టుపురం వెళ్లి సారా తాగి వెంట కూడా తెచ్చుకోవటం నిత్యకృత్యం.
సారా రహిత జిల్లా ఎక్కడ మంత్రివర్యా..?
జిల్లాలో నాటుసారా ఊసేలేదని మంత్రి ప్రకటించిన సంత్సరన్నర కాలం నుంచి ఎక్కడా సారా నిలుపుదల కాలేదు. జిల్లాలోని చీరాల, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాలతో పాటుగా మారుమూల తాండాల్లో కొందరు కొన్నేళ్లుగా నాటుసారా తయారు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఏదో చాటుమాటుగా కాకుండా ఇళ్ల వద్దే సారా కాస్తున్నారంటే సారా అమ్మకాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చీరాల, రామ్‌నగర్, ఆదినారాయణపురం, సాయికాలనీ, తోటవారిపాలెం వీవర్స్ కాలనీకి చెందిన కొందరు స్టువర్టుపురంలో కాచే సారాను ఐదు లీటర్ల క్యాన్ రూ.400 కొనుగోలు చేసి, మందుబాబులకు గ్లాస్ రూ.10, క్వార్టర్ రూ.20–రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. అందులోనూ మొదటి క్వాలిటీ, రెండవ క్వాలిటీని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటారు. ప్రధానంగా కూలీ పనులు చేసుకుని బతికే కాలనీవాసులకు అందుబాటులో సారా విక్రయాలకు అడ్డూఅదుపూ ఉండటం లేదు. ఇదిలా ఉంటే చీరాల ప్రాంతంలోని దండుబాట, స్వర్ణరోడ్డు, జాలమ్మగుడి, ఉజిలీపేట, శృంగారపేట, గాంధీనగర్, ఎఫ్‌సీఐ గోడౌన్స్ సమీపంలో కూడా సారా విక్రయాలు రోజూ భారీ స్థాయిలో జరుగుతుంటాయి.
చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు...
నాటుసారా వ్యవహారాన్ని స్థానిక పోలీసులు గానీ, ఎక్సైజ్ పోలీసులు గానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. స్టువర్టుపురం నుంచి చీరాలకు ఆటోలు, టూవీలర్స్‌లలో నేరుగా చీరాలకు తరలిస్తుంటారు. అయితే ఈపూరుపాలెం రోడ్డు పక్కనే రూరల్ పోలీస్‌స్టేషన్ అనేది ఒకటుంటుంది. కానీ అక్కడ తనిఖీల తంతుకానీ, కనీసం నిఘా కానీ ఉండదు. పోలీస్‌స్టేషన్ దాటుకుని నేరుగా ఈపూరుపాలెం, చీరాల ప్రాంతాలకు నాటుసారా తరలిస్తున్నా స్థానిక పోలీసులు సారా పట్టుకుంటే మనకేమి వస్తుందిలే అనుకున్నారేమో గానీ వారి జోలికి అస్సలు వెళ్లరు. ఎక్సైజ్ పోలీసుల పరిస్థితైతే మరీ దారుణం. వారికి సారా సామ్రాట్లు అంటే మహా భయం. ఎక్సైజ్ పోలీసులపై సారా అమ్మే మాజీ నేరస్తులు పలుమార్లు దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు చీరాల్లో అనేకం ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌తో పాటు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సబ్‌డివిజన్ టాస్క్‌ఫోర్స్ ఉన్నప్పటికీ వారు సారా నియంత్రించటంలో నామమాత్రంగా కూడా దృష్టి పెట్టడం లేదు.
స్థానికంగా కూడా తయారీ..
గతంలో కేవలం స్టువర్టుపురంలో సారా తయారై చీరాలకు అక్రమ రవాణా జరుగుతుండేది. కానీ సారాకు డిమాండ్ పెరగటంతో స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈపూరుపాలెం స్ట్రయిట్‌కట్ పక్కన, రామ్‌నగర్ గ్యాంగిలో, మత్య్సకార గ్రామమైన వాడరేవులో, విజిలీపేట, జాలమ్మగుడి, ఫ్‌లైఓవర్ బ్రిడ్జి కింద, జవహర్ నగర్ ప్రాంతాల్లో కాపుసారా అమ్మకాలకు నిలయంగా మారింది. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు కొందరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని సారా నియంత్రణకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రైవేటు వ్యక్తులు సారా అమ్మకందారులతో చేతుల కలపడంతో సారా పరవళ్లు తొక్కుతోంది. కాపు సారా తయారీకి అధిక మోతాదులో మిరపకాయలు, యూరియా, బ్యాటరీ పౌడర్‌తో పాటు ఇతర హానికరమైన విష పదార్థాలను కలుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు చొరవచూపి సారా మహమ్మారిని చీరాల ప్రాంతం నుంచి తరిమికొట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సారా నియంత్రణకు దాడులు చేపడుతున్నాం
జిల్లాలో నాటుసారా తయారీ, అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. వారంలో ఒకరోజు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నాం. సారా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. చీరాల ప్రాంతంలో ఇటీవల మాజీ నేరస్తులు 28 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసి వారిపై ప్రత్యేక నిఘా ఉంచాం. ప్రత్యేక బృందాలు, ఆయా పోలీస్‌స్టేషన్లలోని సీఐలు, ఎస్సైలు రోజువారీ తనిఖీలు, దాడులు చేస్తున్నారు.–పి.శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఈఎస్, ఒంగోలు.
Comments
Please login to add a commentAdd a comment