శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో అనేక విద్యాసంస్థలు ఏర్పాటుచేసి సరస్వతీసీమగా మార్చుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్‌ఐటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇటీవల బడ్జెట్‌లో విద్యకు అధిక మొత్తాన్ని కేటాయించామని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో జిల్లాలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాత్రమే ఉండేదని గుర్తుచేశారు.
1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వెంకయ్యనాయుడుతో స్నేహసంబంధాలు ఉన్నాయన్నారు. మోడీ నాయకత్వంలో వెంకయ్యనాయుడు, స్మృతిఇరానీ సహకారంతో కేంద్రంనుంచి అధికంగా నిధులు సమకూర్చుకుని రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తెలుగువాళ్లు చాలా మేధావులని అభివర్ణించారు. విదేశాల్లోను ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి హాలిడే ఇచ్చిందని ఎద్దేవా చేశారు.
కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ దేశస్థాయిలో విద్యాభివృద్ధికి దోహదపడతారని తెలిపారు. అయితే కాంగ్రెస్‌వాళ్లు ఆమెకు కనీసం డిగ్రీలు లేవని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. డిగ్రీల కన్నా మేధస్సు ముఖ్యమని, ఆ మేధస్సు ఆమెకుందని కొనియాడారు. స్మృతీ ఇరానీ మాట్లాడుతూ రాష్ట్రవిభజనతో ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామన్నారు. త్వరలో అనంతపురంలో కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపిస్తామన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ర్టమంత్రులు బొజ్జల, కామినేని, నారాయణ, శ్రీనివాసరావు, ఎంపీలు వరప్రసాద్, సీఎం రమేష్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సరస్వతీ ‘సీమ’
Published Sun, Mar 29 2015 3:57 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement