వెటర్నరీ కళాశాలపై సర్కార్ కన్ను
- వెటర్నరీ కాలేజీలో సచివాలయం ఏర్పాటుకు కసరత్తు!
- గుట్టుగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం
- కళాశాలను గుంటూరుకు తరలిస్తారని ప్రచారం
- ఆందోళనలో అధ్యాపకులు, విద్యార్థులు
విజయవాడ : ఒకవైపు విజయవాడలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థలు నెలకొల్పుతామని చెబుతున్న పాలకులు.. మరోవైపు ఉన్న ప్రతిష్టాత్మక కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తు చేయడం విడ్డూరంగా ఉంది. గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీని మంగళగిరికి తరలిస్తున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలపై ప్రభుత్వం కన్ను పడినట్లు సమాచారం.
ఎయిర్‌పోర్టుకు, ఐటీ పార్కుకు మధ్యలో అసెంబ్లీని తలపించేలా భవన సముదాయం ఉన్న ఈ కళాశాలను మరో ప్రాంతానికి తరలించి ఇక్కడ సెక్రటేరియేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం బయటకు పొక్కడంతో కళాశాల వర్గాలు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వెటర్నరీ కళాశాల క్యాంపస్‌ను త్వరలో నిర్మించే రాజధానిలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సీఎం దృష్టిలో పడిందిలా..
ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జాతీయ రహదారి పక్కనే సుందరంగా ఉన్న వెటర్నరీ కళాశాల భవన సముదాయం కనిపించింది. ఆయన పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులతో ఈ భవనం గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే సచివాలయం ఏర్పాటుకు పరిశీలించాలని సూచించినట్లు సమాచారం.
ఎయిర్‌పోర్టుకు దగ్గరగా..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో గన్నవరంలో వెటర్నరీ కళాశాలను 1998లో ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టుకు ఎదురుగా ఒకప్పటి బేకన్ ఫ్యాక్టరీలో సుమారు 25 ఎకరాల స్థలంలో భవన సముదాయం నిర్మించారు. ఇక్కడ దాదాపు వందకుపైగా గదులు ఉన్నాయి. కళాశాలకు అతి దగ్గరలో మరో 30 ఎకరాల్లో దాదాపు 25 వేల చదరపు అడుగుల్లో మూడు ఆంతస్తుల అప్మెల్ భవనం, ఖాళీ స్థలం వెటర్నరీ కళాశాల ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలంలో విద్యార్థులకు అవసరమైన పౌల్ట్రీఫారం, పశుగ్రాసం పెంపపం వంటివి చేపట్టారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 328 మంది బీవీఎస్‌ఈ విద్యార్థులు, 28 మంది పీజీ, ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలకు అనుబంధంగా గన్నవరంలో బోధనాస్పత్రి ఉంది.
వెటర్నరీ కళాశాల తరలిస్తున్నట్లు జోరుగా ప్రచారం
ధరలు పెరిగినందున రాజధాని కోసం భూముల సేకరణ కష్టం కావడంతో ప్రస్తుతం వెటర్నరీ కళాశాలతోపాటు ఖాళీగా ఉన్న 30 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెటర్నరీ కళాశాలను ప్రత్నామ్నాయంగా గుంటూరు జిల్లాకు తర లిస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.