పవర్‌కు ‘చెక్’
Published Sun, Aug 25 2013 3:26 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM
ఏలూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలోని సర్పంచ్‌లు 17 ఏళ్ల క్రితం పోరాటం చేసి చెక్ పవర్ సాధించుకున్నారు. ఆ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులతో కలిసి పంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించటంతో సర్పంచ్‌లు మరోసారి ఆందోళన దిశగా పయనిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు జిల్లా సర్పంచ్‌ల చాంబర్ తరఫున ప్రతినిధులు త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నారు. సర్పంచ్‌ల చెక్‌పవర్‌ను రద్దు చేసే యత్నంలో మొదటి మెట్టుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఇచ్చారనే అనుమానాలు సర్పంచ్‌లకు ఉన్నాయి. సర్పంచ్‌లు అవతవకలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినపుడు, అవి రుజువైన సందర్భాల్లో మాత్రమే చెక్‌పవర్‌పై ఆంక్షలు విధించేవారు. పంచాయతీలకు రెండేళ్ల తరువాత ఇటీవలే పాలకవర్గాలు ఏర్పడినందున ప్రభుత్వం నిధులివ్వాల్సిందిపోయి, కొత్త సర్పంచ్‌లను అవమానించేలా ఈ ఆంక్షలేమిటంటూ వారు ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు.
గ్రామ పాలనపై ప్రతికూల ప్రభావం!
రెండేళ్లుగా గ్రామాల్లో పాలకవర్గాలు లేక పాలన కుంటుపడింది. దానిని గాడిలో పెట్టాలంటే ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సరిదిద్దేందుకు సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. మరోవైపు జిల్లాలోని 884 పంచాయతీల్లో సగానికిపైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి మూడేసి గ్రామాల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తోంది. వారు ఎప్పుడు ఏ గ్రామంలో ఉండాలనే విషయమై నిర్దిష్టమైన జాబ్‌చార్ట్ అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీలు చేపట్టాల్సిన అత్యవసర సేవలపై సర్పంచ్ సొంత నిర్ణయం తీసుకోవటం సాధ్యమయ్యే వీలు లేదు. చెక్‌పవర్ విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రచ్ఛన్న యుద్ధాలు సాగే ప్రమాదం లేకపోలేదని పలువురి విశ్లేషణ. జాయింట్ చెక్ పవర్‌తో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే గ్రామాల్లో పాలన కుంటుపడుతుందనేది విశ్లేషకుల భావన.
ఎందుకీ కళ్లెం
1996 నుంచి గత పంచాయతీ పాలకవర్గాల వరకు సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంది. నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవార్గలకు ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు పదవి చేపట్టిన నెలలోనే వారి హక్కులను కాలరాసేలా జాయింట్ చెక్‌పవర్ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ చర్య సర్పంచ్‌లను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ ఉద్యోగుల కనుసన్నల్లోనే వారు ఉండేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనన్న వాఖ్యలు వినవస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై పోరాటం సాగించే దిశగా సర్పంచ్‌లు యోచిస్తున్నారు.
సర్పంచ్‌లను కించపర్చటమే
1996లో 15వేల మంది సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించి చెక్‌పవర్‌ను సాధించాం. అప్పటి నుంచి కొనసాగుతున్న హక్కును కాలరాస్తూ జాయింట్ చెక్‌పవర్ ఇవ్వటం చూస్తుంటే అధికారులను నమ్మి, ప్రజాప్రతినిధులను దొంగలుగా అవమానించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధిస్తుంది. ఈ జీవోను వెనక్కి తీసుకునేలా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో సీఎం కిరణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కలసి వివరిస్తాం.
- పిల్లి వెంకటసత్తిరాజు, జిల్లా సర్పంచ్‌ల చాంబర్ గౌరవాధ్యక్షుడు
Advertisement