సాక్షి, శ్రీకాకుళం: లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. సావిత్రి కోసం ఎన్టీఓడు పాడుతుంటే.. ఉలిక్కి పడి లేచాడు సర్వేశ్వరరావు.. సమయం ఉదయం ఐదున్నర. ప్రచారానికి ఇంకా సమయం ఉంది. ఆ లోపు తానే సొంతంగా కొంతమందినైనా కలుద్దామని అప్పటికప్పుడే అనుకుని కాస్తంత ఫ్రెష్ అయ్యి వీధిలో పడ్డాడు. మహిళామణుల ఊసులు వినలేకేమో కుళాయి బలహీనంగా ఏడుస్తోంది.. బిందె నిండడానికి అధమపక్షం అరగంటైనా పట్టేట్టు ఉంది. సరిగ్గా సర్వేశ్వరరావు అక్కడికే వెళ్లారు. ఏంటమ్మా.. నీరు అవీ బాగా వస్తున్నాయా.. ఇబ్బందులేమీ లేవు కదా.. మైక్ లేదు కాబట్టి చాలా క్యాజువల్‌గా మాట్లాడాడు. మందీమార్బలం లేని ఎమ్మెల్యేను చూసి గుర్తు పట్టలేకపోయిన మహిళలు. కొద్దిసేపటికే తెలివి తెచ్చుకున్నారు. అంతే.. అందరూ చుట్టూ చేరిపోయారు.
బాబూ.. ఐదేళ్ల ముందు ఇక్కడే జీపుపై నుంచుని ట్యాంకు గురించి హామీలిచ్చారు. గుర్తుందా.. మహిళల మొదటి ప్రశ్న. ఇచ్చామా.. ఇచ్చే ఉంటాం. శతకోటిలో ఇదొకటి అని సర్వేశు మనసులో అనుకుని, అవునమ్మా ట్యాంకుతో మీ కష్టాలన్నీ తీరాయి కదా అన్నాడు గర్వంగా. ‘మా మేడెక్కి ఈ చుట్టుపక్కల ఒక్క ట్యాంకు ఉన్నట్టు చూపిస్తే.. మా ఓట్లన్నీ మీకే’ అని వత్సల గబుక్కున అనేసింది. సర్వేశుకు పరిస్థితి అర్థమైపోయింది. గత సారి ఏదో అలా అయిపోయిందమ్మా.. ఈసారి అలా కాదు. చూడండి, ఓట్లు మాత్రం నాకే వెయ్యాలి అని గుంపులో నుంచి బయటపడ్డానికి ప్రయత్నించాడు. ‘జీపుపై ఉన్నప్పుడు వంద మాటలు చెబుతా రు.. ఇలా నేల మీద నించున్నప్పుడు మాత్రం ఒక్కరితో మాట్లాడలేరు. మీకెందుకు ఓటు’ అని భాగ్యవతి మొహమ్మీదే అనేయడంతో ఏమీ అనలేక సర్వేశు మెల్లగా జారుకున్నాడు.
వెనుక మంది లేకుండా ఇలా గుంపులోకి అదీ ఆడవాళ్ల దగ్గరికి వెళ్లకూడదని సర్వేశుకు జ్ఞానోదయమైంది. అలా నడుస్తూ నడుస్తూ ఓ గుడిసె దగ్గర ఆగాడు. ఇంటి బయట కల్లాపి చల్లుతున్న పద్మ సర్వేశును చూసి కాసింత ఆశ్చర్యపోయింది. ఆమె హావభావాలు గమనించిన సర్వేశు ఈమేదో అమాయకురాలిలా ఉందనుకుని అటువైపే అడుగులు వేశారు. ఏమ్మా.. ఇల్లు లేదా ఇంకా గుడిసెలోనే ఉన్నారు.. నిమ్మళంగా అడిగాడు. ఇల్లు మంజూరైందయ్యా.. మీ వెనుక తిరిగే వారున్నారు కదా.. ఏదో కమిటీ అట.. ఐదు వేలు ఇస్తేనే నీకు ఇల్లు ఇస్తామని సెప్పారు. అంత డబ్బు కట్టనేక ఇలా గుడిసె నీడన బతకతన్నాం బాబూ అంది పద్మ. అమ్మా.. ఐదు తీసుకుంటున్నారా.. నాకు రెండున్నరే ఇస్తున్నారు అని లోలోపలే అనుకున్న సర్వేశు ఈమెతో మాట్లాడితే బండారం బయటపడుతుందని భయపడి ‘నాకు ఓటెయ్యమ్మా.. ఈసారి ఇల్లు గ్యారెంటీ’ అని వేగంగా నడిచాడు.
మైదానం నుంచి ఓ కుర్రమూక అటుగా వచ్చి సర్వేశు మాటలు విని ఆయన చుట్టూ చేరిపోయారు. చచ్చానురా.. బాబోయ్.. అనుకున్నాడు సర్వేశు. ఎమ్మెల్యే గారూ.. ఇన్నాళ్లకు దొరికారు అన్న భరత్.. ఐదేళ్ల కిందట ఎమ్మెల్యే చెప్పిన మాటలన్నీ ఒక్కసారి ఏకరువు పెట్టాడు. ఇవన్నీ ఏమయ్యాయండీ అని అంతా మూకుమ్మడిగా అడిగేసరికి సర్వేశు గుటకలు మింగి ఏదో చెబుదామని ప్రయత్నించాడు. ఐదు నెలలుగా డబ్బులు ఇస్తున్నాం కదయ్యా.. చాలడం లేదా ఇంకా అని భయపడుతూనే అన్నాడు సర్వేశు. డబ్బులిస్తే.. ఉద్యోగాలు ఇవ్వలేదనే విషయం మర్చిపోతామా.. నాలుగు నెలలు కాసిన్ని డబ్బులు విదిలిస్తే నాలుగేళ్లు మీ అరాచకాలు మర్చిపోతామా..? అసలు మీరెప్పుడైనా కారు దిగి ఇటుగా నడిచారా.. కాలువ ఉందో లేదో చూశారా.. ఇక్కడి మనుషులు ఎలా బతుకుతున్నారో గమనించారా.. అంటూ అభ్యుదయవాదైన నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు.
సర్వేశుకు అంతా అర్థమైపోయింది. ఐదు నెలల కాలక్షేపం ఐదేళ్ల పాలన ఒక్కటి కాదని అర్థమైంది. జనం తాను అనుకున్నంత అమాయకులు కాదని తెలిసింది. ప్రశ్నించడం కూడా చేతనవుతుందని జ్ఞానోదయమైంది.. అన్నింటి కంటే ఒక్కటి మాత్రం బాగా తెలిసింది. చుట్టూ మంది లేకుండా ఒంటరిగా జనం దగ్గరకు వెళ్లకూడదని స్పష్టంగా తెలిసింది. అంతే.. ఓటు అడగడం కూడా మర్చిపోయి ఇంటి వైపు పరుగు లాంటి నడక అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment