హవ్వా.. ఇదేం సన్యాసం
తప్పుకున్నానంటూనే రాజకీయం
సర్వేల పేరుతో గిమ్మిక్కుల వైనం
విషయం ఏదైనా వ్యక్తిగత ప్రచారం
ఇవీ లగడపాటి చీప్ పాలి‘ట్రిక్స్’
కాశీకి పోయాను రామాహరి
గంగ తీర్థమ్ము తెచ్చాను రామాహరి
కాశీకి పోలేదు రామాహరి
మురుగు కాల్వలో నీళ్లండీ రామాహరి
శ్రీశైలమెళ్లాను రామాహరి
శివుని విభూది తెచ్చాను రామాహరి
శ్రీశైలం పోలేదు రామాహరి
ఇది కాష్టంలో బూడిద రామాహరి
ఈ తరం వారికి ఈ పాట పరిచయం లేకపోయినా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరం వారికి హాస్యభరితమైన ఈ సినీ గీతం సుపరిచితమే. అప్పు చేసి పప్పు కూడు సినిమాలో రేలంగి, గిరిజలు తమ నటనతో ఈ సన్నివేశంలో నవ్వులు పండించారు. సన్యాసం వేషం వేసి జనాన్ని మాయచేసే ప్రయత్నాన్ని తిప్పికొడుతూ అవన్నీ ఉత్తుత్తివేనని... నమ్మవొద్దని తనూ పాట రూపంలోనే కౌంటరిస్తుంది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్రం విడిపోదని గట్టిగా చెప్పారు.. తీరా విభజన అయ్యాక తనదైనశైలిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. రాజకీయ సన్యాసం చేశానంటారు.. మళ్లీ కొత్త రాజకీయ పార్టీలో కీలకంగా కొనసాగుతున్నారు. ఆయన చేసే చీప్ పాలి‘ట్రిక్స్’ను చూసి ‘హవ్వా ఇదేం సన్యాసం’ అంటూ జిల్లా ప్రజలు చీదరించుకుంటున్నారు. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదనడానికి ఇదో ఉదాహరణ.
ఇదేమి కిరికిరి...
రాజకీయ సన్యాసం అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం అని అందరికీ తెలుసు. అయితే ఆయన ఇప్పుడు రాజకీయ సన్యాసానికి కొత్త నిర్వచనాన్ని రచిస్తున్నారు. రాజకీయాల్లో కీలకంగా కొనసాగుతూనే ... రాజకీయ సన్యాసం చేస్తారట..! ఇదేమి సన్యాసం అని ఆయనను ఎన్నుకున్న ఓటర్లే కాదు ఆయన అనుచరులు కూడా జుట్టు పీక్కుంటున్నారు.
శకునం చెప్పే బల్లి కుడితి కుండీలో పడ్డట్టు...
మాజీ ఎంపీ పర్వతనేని ఉపేంద్ర అల్లుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లగడపాటి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2004, 2009లో గెలుపొందారు.
రెండు పర్యాయాలు ఎంపీ అయిన ఆయన పలు సందర్భాల్లో చేయించిన సర్వేలు ఫలితాలకు కాస్త దగ్గరగా ఉండటంతో తాను చెప్పేదంతా జరుగుతుందన్న విశ్వాసాన్ని చాటుకునే ప్రయత్నం చేసేవారు.
అందుకే సర్వేలను సాకుగా చూపించి ఆయన చాలా విషయాలు చెబుతూ ఉంటారు. రాష్ట్ర విభజన విషయంలో కూడా ఆయన పలుసార్లు ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ర్టం సమైక్యంగా ఉంటుందని గట్టిగా నమ్మించే ప్రయత్నం చేశారు.
సర్వేలను నమ్ముకున్న లగడపాటి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సర్వే చేయించి నివేదికలు పంపించామని, అవి నిజమని తేలిన తర్వాత కేంద్రం విభజన విషయంలో వెనక్కి తగ్గుతుందని ప్రకటించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ విభజన విషయంలో వేగం పెంచింది. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది. పార్లమెంట్‌లో బిల్లు పెట్టలంటేనే భయపడేలా చేస్తామన్నారు.
ఇంత హడావుడి చేసిన లగడపాటి విభజన విషయంలో అధికార పార్టీ ఎంపీగా చేతులెత్తేసి రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు. అయితే అందరూ ఆయన ఇంకా రాజకీయాల్లో ఉండరని, వ్యాపారాలు చేసుకుంటూ ఉండిపోతారని భావించారు. అలా జరిగితే రాజగోపాల్ ఎందుకు అవుతారు.
అందుకే ఆయన మరుసటి రోజు నుంచి నిత్యం రాజకీయాల్లోనే మునిగి తేలుతున్నారు. అంతేకాదు విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభినందన సభలు పెట్టి లగడపాటిని కీర్తించుకునేలా అనువైన క్యాడర్‌ను బతిమాలుకోవాల్సి వచ్చింది.
అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన లగడపాటికి వ్యూహకర్త బాధ్యతలు అప్పగిస్తున్నట్టు కిరణ్ ప్రకటించారు.
ప్రచారమే పరమావధి...
లగడపాటి ఏది చేసినా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కోరుకుంటారు. అదే క్రమంలో రాజకీయ సన్యాసం నిర్ణయాన్ని ప్రకటించి విజయవాడ వచ్చిన సందర్భంగాను పెద్ద్ద హైడ్రామాకు తెరతీశారు. తనకు అనుకూలంగా ఉండే కార్యకర్తలు, నాయకులను భారీగా సమీకరించి లగడపాటి రాజకీయాల్లో కొనసాగాల్సిందేనంటూ వారితో హడావుడి చేయించారు. దీని కోసం చాట్రాయిలో ఒక కార్యకర్త ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
అక్కడికి వెళ్లిన లగడపాటి రాష్ట్ర విభజనపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినా, కిరణ్ పార్టీ పెట్టినా రాజకీయాల్లో కొనసాగుతానంటూ రాజకీయాలపై తనకున్న మక్కువను బయటపెట్టారు. ఏదో ఒకరకంగా రాజకీయాల్లో నెట్టుకొచ్చేందుకు ఆయన తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున సొంత ప్యానల్‌ను పెట్టి రాజకీయంగా ఉనికిని కోల్పోకుండా ప్రయత్నాలకు తెరతీశారు. రాజకీయం అనే నీటిలో చేపలా మారిన లగడపాటి పదవే పరమావధిగా ఏదో ఒక సాకుతో మళ్లీ ఎన్నికలకు సిద్ధమవుతారని ప్రజలు చర్చించుకోవడం కొసమెరుపు.