అబ్బో ‘రాజు’ దర్పం!
పచ్చ చొక్కాలు వేసుకోలేం..
తేల్చిచెప్పిన నేతలు, కార్యకర్తలు
శత్రుచర్లకు భంగపాటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూడు దశాబ్దాలకుపైగా ఉత్తరాంధ్రలో ప్రముఖ రాజకీయనేతగా గుర్తింపు పొందిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఝలక్ తగిలింది. కాంగ్రెస్ కుదేలు కావడం.. వైఎస్సార్‌సీపీలో స్థానం లేకపోవడంతో టీడీపీలో చేరాలన్న శత్రుచర్ల వ్యూహాన్ని ఆయన ప్రధాన అనుచరగణమే తిప్పికొట్టింది. పాతపట్నం నియోజకవర్గం లో ఐదేళ్లుగా తనతో పనిచేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలతో కలసి మూకుమ్మడిగా టీడీపీలో చేరాలని శత్రుచర్ల భావించారు. ఆ మేరకు టీడీపీతో ఒప్పందం కుదుర్చుకుని ఆ తరువాత తీరిగ్గా నేతలు, కార్యకర్తలతో పాతపట్నం పొరుగున ఉన్న ఒడిశాలోని పర్లాకిమిడిలో మంగళవారం సమావేశం నిర్వహించారు.
కానీ, శత్రుచర్ల వ్యూహం బెడిసికొట్టింది. సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తల్లో దాదాపు 75 శాతం మంది టీడీపీలో చేరాలన్న ఆయన ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు. శత్రుచర్లకు ఆయన ప్రధాన అనుచరుడు, మెళియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహనరావు నుంచే వ్యతిరేకత ఎదురైంది. సమావేశం ప్రారంభమైన కాసేపటికే ఆయన లేచి ‘మేం 30 ఏళ్లుగా టీడీపీతో పోరాడుతున్నాం.. మీ రాజకీయ స్వార్థంకోసం మమ్మల్ని టీడీపీకి తాకట్టు పెట్టొద్దు.. మేం మీతోపాటు టీడీపీలో చేరలేం. పచ్చచొక్కా వేసుకోవడం మా వల్ల కాదు’ అని కుండబద్దలు కొట్టేశారు. ‘ఈ సమావేశంలో మేం కొనసాగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి. కాబట్టి మేమంతా సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం’అని చెప్పి బయటకు వెళ్లిపోయారు. మెళియాపుట్టి మండలానికి చెందిన 40 మంది సర్పంచులు కూడా సలానకు సంఘీభావం తెలుపుతూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. వారంతా కూడా ‘జై జగన్... జై వైఎస్సార్ కాంగ్రెస్’అని నినాదాలు చేసుకుంటూ వెళ్లిపోవడం గమనార్హం.
అబ్బో ‘రాజు’ దర్పం!
పాతపట్నం, న్యూస్‌లైన్: ఆయనో ప్రజాప్రతినిధి.. రెండుసార్లు రాష్ట్రమంత్రిగా పనిచేశారు. పైగా గిరిజనవర్గానికి ప్రతినిధి. అయితేనేం. ఆయన రాజు గారు. అందుకే రాచరికాలు పోయినా.. ‘రాజు’దర్పం ఇంకా పోలేదనడానికి ఈ ఫొటోయే నిదర్శనం. ఈ ఫొటోలో చెప్పు లు తొడిగించుకుం టున్న వ్యక్తి శుత్రుచర్ల విజయరామరాజు. చెప్పులు తొడుగుతున్న యువకుడు ఓ గిరిజనుడు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. తన వర్గం కార్యకర్తల సమావేశానికి వెళ్లే ముందు శత్రుచర్ల సతీసమేతంగా నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చి ఓ గిరిజన కార్యకర్తతో చెప్పులు తొడిగించుకున్నారు. దీనిపై గిరిజన సంఘాల ప్రతి నిధులు, ప్రజలు మండిపడుతున్నారు.