పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా ఆరాధనోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ఈ ఉత్సవాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు హాజరయ్యారు. సాయి నామస్మరణతో సభామందిరం మార్మోగింది. ఉదయం ఎనిమిది గంటలకు విద్యార్థుల వేద మంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం సత్యసాయిని కీర్తిస్తూ ‘పంచరత్నకీరి’్త పేరుతో భక్తిగీతాలు ఆలపించారు. సత్యసాయి మిరుపురి కళాశాలకు చెందిన వసంత లక్ష్మి, సంగీత విద్వాంసుడు శ్రీరాజ్‌కుమార్ భారతీల బృందం ఆలపించిన గీతాలు భక్తులను మైమరపింపజేశాయి. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు మద్రాస్C భక్తులనుద్దేశించి ప్రసంగించారు. బాబా శివైక్యం పొంది నాలుగేళ్లు అవుతోందన్నారు.
ఆయన మొదలుపెట్టిన సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వాటిని సాయి రాముడే నడిపిస్తున్నాడన్న విషయాన్ని ప్రతి భక్తుడు గుర్తించాలన్నారు. సత్యసాయి సర్వాంతర్యామి అని, ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కారని అన్నారు. గతంలో బాబా భక్తులకిచ్చిన దివ్యసందేశాన్ని డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వినిపించారు. వేడుకలకు హాజరైన భక్తులు,విద్యార్థులు మహాసమాధి చెంత ప్రణమిల్లి సత్యసాయిని శరణువేడారు.
నారాయణసేవ : ఆరాధనోత్సవాల్లో భాగంగా స్థానిక హిల్‌వ్యూ స్టేడియంలో మహా సత్యసాయి నారాయణ సేవ నిర్వహించారు. ఉదయం 10.30కి సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ప్రతి ఒక్కరికీ అన్నప్రసాదంతో పాటు,చీర, ధోతీ అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, చక్రవర్తి, నాగానంద, మద్రాస్ శ్రీనివాస్, టీకేకే భగవత్, ఎస్వీ గిరి,ట్రస్ట్ కార్యదర్శి ప్రసాద్ రావు, మాజీ మంత్రి గీతారెడ్డి, టీవీఎస్ సంస్థల అధినేత శ్రీనివాసన్,ఆయన సతీమణి మల్లికా శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
ఆశయాల కొనసాగింపే సత్యసాయికి నిజమైన నివాళి
మంత్రి పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తి టౌన్ : ఆశయాల కొనసాగింపే సత్యసాయికి నిజమైన నివాళి అని రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి ఆరాధనోత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. హిల్‌వ్యూ స్టేడియంలో నారాయణ సేవ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్యం, తాగునీరు అందివ్వడంతో పాటు ఆధ్యాత్మిక బోధనల ద్వారా మానవాళికి మహోన్నతమైన సేవలను అందించిన సత్యసాయి భక్తుల మదిలో నిలిచిపోయారన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల అమలుకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు.
వెలకట్టలేని బహుమతి సాయి అవతారం : సమత, మమతలను బోధిస్తూ మానవాళి శ్రేయస్సుకు పాటుపడిన సత్యసాయి అవతారం భక్తులకు వెలకట్టలేని బహుమతి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ అన్నారు. ఆరాధనోత్సవాలలో భాగంగా ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసాయి సర్వాంతర్యామి అని, అందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయని తెలిపారు. సత్యసాయి తన తల్లికి ఇచ్చిన మాట మేరకు ఎన్నటికీ పుట్టపర్తిని వీడరన్నారు.
ఆశయాలను మరింత ముందుకు తీసుకుపోతాం : సత్యసాయి ఆశయాలను ట్రస్ట్ మరింత ముందుకు తీసుకెళుతుందని ట్రస్ట్ సభ్యుడు ఆర్‌జే రత్నాకర్‌రాజు అన్నారు. నారాయణసేవ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ట్రస్ట్ రూ.80 కోట్లతో 118 గ్రామాలకు తాగునీరు అందించిందన్నారు.
పుట్టపర్తి నగరపంచాయతీ పరిధిలోని గ్రామాలకు మరో రూ.2 కోట్లతో తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసిందన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో ప్రమాణాలను మెరుగు పరిచేందుకు రూ.7 కోట్లతో ల్యాబొరేటరీ, రూ.20 కోట్లతో పరికరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సత్యసాయి జీవించిన యజుర్ మందిరం సందర్శనకు భక్తులను అనుమతించడానికి కొంత స్థలాభావ సమస్య ఉందన్నారు. సత్యసాయి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఘనంగా సత్యసాయి ఆరాధనోత్సవాలు
Published Sat, Apr 25 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement