దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు....
ఒంగోలు టౌన్: దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో కృషి చేయాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సమాఖ్యల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట సత్యాగ్రహం నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కరవది సుబ్బారావు సత్యాగ్రహాన్ని ప్రారంభించి ప్రసంగించారు. కొన్నేళ్లుగా దళితులపై అత్యాచారాలు, అణచివేతలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ అవసరమని ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టినా అన్ని రంగాల్లో దళితులు, ఆదివాసీల అభ్యున్నతి గురించిప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ పేదలు, దళితులకు ప్రతి కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇవ్వడంతోపాటు సాగుకు ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ తదితర సంక్షేమ పథకాల్లో నగదు బదిలీ పథకాన్ని అమలు ఆలోచనను విరమించుకోవాలన్నారు.
పేదల గృహాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆర్ వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. వృద్ధులు, వితంతువులకు రూ.3 వేలు, వికలాంగులకు రూ.3500 చొప్పున పింఛన్ అందించాలన్నారు. అభివృద్ధి పేరుతో అసైన్డ్ భూము లు, నివాసంలోని భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అంతకుమించి భూమిని వారికి ఇచ్చి జీవనాధారం కల్పించాలని డిమాండ్ చేశారు.
దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ పాలస్ అధ్యక్షతన జరిగిన సత్యాగ్రహంలో రిటైర్డు అడిషనల్ జాయింట్ కలెక్టర్ షంషేర్ అహ్మద్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌డీ సర్దార్, అభ్యుదయ వేదిక నాయకుడు నూనె మోహన్‌రావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి జీ శివాజీ తదితరులు పాల్గొన్నారు.