రెండిళ్ల పూజారి!
Published Fri, Dec 27 2013 2:59 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. ఎంతో కీలకమైన ప్రభుత్వ విభాగం. జిల్లాలో ప్రతిరోజూ వందలాది క్రయ విక్రయాలు, లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రభుత్వానికి లక్షలాది రూపాయల ఆదా యం సమకూరుతుంది. వీటిని పర్యవేక్షించటం, కొన్నింటిని స్వయంగా నిర్వహించటం జిల్లా రిజిస్ట్రార్ బాధ్యత. అలాంటిది రెండు జిల్లాల బాధ్యతను ఒక్క అధికారే నిర్వర్తిస్తే అటు క్రయవిక్రయదారులు, ఇటు న్యాయవాదులకు ఇక్కట్లు తప్పవు. జిల్లాలో 8 నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదు.
ఇదీ సంగతి..
విజయనగరం జిల్లా రిజిస్ట్రార్ ఆర్.సత్యనారాయణ 8 నెలలుగా ఈ జిల్లా ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సహజంగానే విజయనగరం జిల్లా వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్న ఆయన ఈ జిల్లాకు వారానికి రెండు రోజులు కూడా కేటాయించటం లేదని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. దీంతో పలు కీలక వ్యవహారాలు, చిట్స్ కే సులు, ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ముఖ్యంగా కోర్టుకు సంబంధించి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చే విషయంలోను, చిట్ ఫండ్ యాక్ట్ కేసుల వ్యవహారాలపై వాయిదాలు ఇచ్చే అధికారం జిల్లా రిజిస్ట్రార్‌కే ఉంది. అయితే ఇన్‌చార్జి రిజిస్ట్రార్ సరిగా రాకపోవటంతో జిల్లాలో ఈ వ్యవహారాలన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఆయన ఎప్పుడుం టారో తెలియక కక్షిదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని ఓ న్యాయవాది చెప్పారు. మరోవైపు.. ఈ జిల్లాలోని 13, విజయనగరం జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు జిల్లా కేంద్రంలోని జాయింట్ రిజిస్ట్రార్-1 పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో భూముల రిజిస్ట్రేషన్లు కొంతమేర మందగించాయి. ప్రస్తుతం జాయింట్ రిజిస్ట్రార్-2 పోస్టులో రెగ్యులర్‌గా ఉన్న ఎస్.రాజేశ్వరరావు జాయింట్-1 రిజిస్ట్రార్‌గా ఇన్‌చార్జి విధుల్లో ఉండగా, జాయింట్-2 రిజిస్ట్రార్ ఇన్‌చార్జి బాధ్యతలను సీనియర్ ఉద్యోగి రాఘవులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ అధికారులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement