గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ!
న్యూఢిల్లీ: చదువుల కేంద్రమైన విశాఖ నగరాన్ని మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత కేవీపీ రాంచంద్రరావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. ఈ అంశాన్ని ఇటీవల రాజ్యసభలో లేవనెత్తానని, అయితే కేంద్రం నుంచి తగిన స్పందన రాలేదన్నారు. విశాఖపట్నం గంజాయికి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో గంజాయి తదితర మాదకద్రవ్యాలకు సంబంధించిన పంటలు విస్తృతంగా సాగవుతున్నాయని, దీనిపై కేంద్ర హోం శాఖ దృష్టి పెట్టాలని కోరారు.
ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, నర్సీపట్నం, చింతపల్లిలో గంజాయి విస్తారంగా సాగవుతోందని వివరించారు. అనకాపల్లి నుంచి రైళ్ల ద్వారా వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. ధనికులు, నిరుపేదలు అన్న తేడా లేకుండా అనేకమంది వీటికి బలవుతున్నారని పేర్కొన్నారు. గంజాయి సాగును ఏపీ సర్కారు అరికట్టలేకపోయిందన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో తగిన సిబ్బంది లేరని, ఉన్న వారికి అవసరమైన ఆయుధాలు, రవాణా సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. దీంతో వారు స్మగ్లర్లను ఎదుర్కోలేకపోతున్నారని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈ తరహా మాదక ద్రవ్యాల సాగు నడుస్తోందని, దీన్ని అరికట్టేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.