
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ బిల్లును శాసనసభ మంగళవారం ఆమోదించింది. గతంలో అసెంబ్లీలో ఆమోదించి పంపిన ఈ బిల్లును శాసన మండలి సవరణలు సిఫార్సు చేసి వెనక్కి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శాసనసభలో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. శాసనమండలి చేసిన సవరణ సిఫార్సులు ఆమోద యోగ్యం కావని, అందువల్ల బిల్లును యథాతథంగా ఆమోదించాలని, ఎలాంటి సవరణలు అవసరం లేదని మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ బిల్లు చరిత్రాత్మకం అని ప్రశంసిస్తూ పలువురు వైఎస్సార్‌సీపీ సభ్యులు మాట్లాడగా, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాత్రం పోడియంలోకి వెళ్లి నిరసనకు దిగారు. బిల్లును ఆమోదించినందుకు ఎస్సీ, ఎస్టీ మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు సభలో సీఎం వైఎస్ జగన్‌ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడారు.
ఎస్టీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్ష
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన బిల్లు చరిత్రాత్మకమని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. ఈ బిల్లును శాసన మండలిలో ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు. తద్వారా ఆయా వర్గాల పట్ల చంద్రబాబు తన వివక్షను చాటుకున్నారని విమర్శించారు. ‘ఎస్సీల సంక్షేమంపై మా నేత వైఎస్ జగన్ చిత్తశుద్ధి ఎంత? మీ నేత చంద్రబాబు చిత్తశుద్ధి ఎంత? చర్చకు రండి’ అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు జగన్‌మోహన్‌రావు, జోగులు, బాలరాజు బిల్లును సమర్థిస్తూ మాట్లాడారు.
సభను టీడీపీ అడ్డుకోవడం దారుణం
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సమర్థించాల్సిన టీడీపీ దీనికి విరుద్ధంగా సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో దిశ, బీసీ కమిషన్ బిల్లుల సమయంలోనూ టీడీపీ ఇలాగే రాద్ధాంత చేసిందని ధ్వజమెత్తారు. దళితుల పట్ల టీడీపీ వివక్ష చూపుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు జగన్ సర్కారు పెట్టిన బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన (స్వగ్రామం ఉన్న) చంద్రగిరిలో దళితులను 40 ఏళ్లుగా ఓట్లు వేయనీయడం లేదని విప్ కొరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment