పట్టుచీరల తయారీకి కావాల్సిన ముడిసరుకు కోసం చేనేత కార్మికులు ఇక ప్రైవేట్‌వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఆలేరులోనే పట్టుదారం డిపోను ప్రారంభించబోతున్నారు. పట్టుపరిశ్రమశాఖ తెలంగాణ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తున్నఈ పట్టుదారం(సిల్క్ యాన్) డిపో వల్ల చేనేతకార్మికులకు లబ్ధిచేకూరనుంది.
భువనగిరి, న్యూస్‌లైన్: నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని భువనగిరి, జన గామ డివిజన్‌లలో పట్టు చీరలు తయారు చేసే చేనేత కార్మికులు వేలాదిగా ఉన్నారు. పట్టు చీరల తయారీకి అవసరమైన పట్టు దారం కొనుగోలు కోసం కార్మికులు నెలనెలా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు ఇచ్చే పట్టు దారంపై ఎలాంటి రాయితీ లభించదు. అయితే చేనేత కార్మికులకు కిలో పట్టుదారంపై 10శాతం సబ్సిడీ ఇచ్చే సిల్క్‌యాన్ డిపోను శుక్రవారం ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రారంభినున్నారు.
కేంద్ర ప్రభుత్వం పట్టుదారంపై ఇస్తున్న సబ్సిడీని ఇంతకాలం పొందకుండా నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ డిపో ద్వారా లబ్ధిచేకూరనుంది. పట్టు పరిశ్రమ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఈ డిపోను తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తోంది. ఈ డిపో వల్ల ప్రతి చేనేత కుటుంబానికి నెలకు నాలుగు కిలోల పట్టుదారంపై 10 శాతం రాయితీ లభిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం కేంద్రాలను పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నడిపి స్తున్నారు.
సబ్సిడీ ఇలా..
కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10 శాతం రాయితీని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికులకు అందజేస్తారు
ఈ మొత్తాన్ని కార్మికులకు నేరుగా ఇవ్వరు
ఎన్‌హెచ్‌డీసీ ద్వారా గుర్తింపు పొందిన పట్టు దారం సప్లయర్స్‌కు సబ్సిడీ ఇస్తారు
అతను ప్రతి కార్మికుడికి నెలకు 4 కిలోల పట్టుదారం సరఫరా చేయాలి
ఇందుకోసం కార్మికులు 90 శాతం చెల్లించి అతని ద్వారా డిపోలో దారం పొందాలి
చేనేత కార్మికులను గుర్తించనున్న జౌళిశాఖ
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని పొందడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. జౌళిశాఖ అధికారులు చేనేత కార్మికులను గుర్తించి వారి జాబితాను ఎన్‌హెచ్‌డీసీకి పంపుతారు. ఆ శాఖ పాస్ బుక్‌లను ఇస్తుంది. అప్పుడు పాస్‌బుక్ ఉన్న కార్మికులకు 10 శాతం రాయితీ లభిస్తుంది. మిగతా 90 శాతం మొత్తాన్ని బ్యాంకులో గుర్తింపు పొందిన సప్లయర్ అకౌంట్‌లో కార్మికుడు జమ చేయాలి. చేనేత కార్మికుడు రాయితీ పొందాలంటే ఆయా సంఘాలు తమ పరిధిలోని నేత కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వడంతో పాటు వారికి గుర్తింపుకార్డులు అందేలా చూడాలి.
డిపో నిర్వహణ ఇలా..
ఈ డిపో నిర్వహణకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తారు. అతడికి 2.5 శాతం సర్వీస్‌చార్జీలు చెల్లించి డిపోను నడిపిస్తారు. కార్మికులు ఉపయోగించుకుంటే భవిష్యత్‌లో పట్టుపరిశ్రమశాఖ తమ ఉద్యోగులను నియమించుకుంటుంది.
చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది
సిల్క్‌యాన్ డిపో ఆలేరులో ఏర్పాటు చేయడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం రాయితీ నేరుగా కార్మికుడికి అందుతుంది. అలాగే నాణ్యమైన సిల్క్ దారం లభిస్తుంది. ఎక్కువ మంది కార్మికులు ఈ డిపోను ఉపయోగించుకోవాలి. డిపోను ప్రారంభించనుండడం ఆనందంగా ఉంది.
- బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే, ఆలేరు
నేతన్నకు బాసట
Published Fri, Jan 31 2014 4:15 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement