సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనుల దరికి చేర్చేందుకు అధికారులు మరింత అంకిత భావంతో పనిచేయాల్సి ఉందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్‌మెంట్ ఫెలోస్’ రూపొం దించిన ‘ఫ్రంది బాటమ్ అప్’ పుస్తకాన్ని బుధవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆవరణలో సీఎం ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల గిరిజనుల్లో ఒకసారి నమ్మకాన్ని కలిగిస్తే సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరమవుతుందన్నారు. గతేడాది ఏప్రిల్ 7న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి రూరల్ డెవలప్‌మెంట్ ఫెలోస్’ పథకం కింద రాష్ట్రంలో 8 నక్సల్ ప్రభావిత జిల్లాల్లో 15 మంది ‘ఫెలోస్’ను నియమించారు. ఏజెన్సీ గ్రామాల్లో ఏడాదిపాటు వివిధ అంశాలపై వీరి పరిశీ లనలను సీఎం అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.సుబ్రమణ్యం, సెర్ప్ సీఈఓ రాజశేఖర్, మానవ వనరుల శాఖ డీజీ ప్రశాంత మహాపాత్ర, అడిషనల్ డీజీ ఆర్.వి.చంద్రవదన్ పాల్గొన్నారు.