చాపాడు: బడి పిల్లలను తీసుకెళ్తున్న స్కూల్ బస్సు కమాన్‌పట్టా విరిగిపోవడంతో.. ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం చియ్యపాడు క్రాస్ రోడ్డు వద్ద గురువారం జరిగింది. చియ్యపాడు నుంచి 40 మంది విద్యార్థులతో చాపాడు వెళ్తున్న విజేత స్కూల్ బస్సు క్రాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బస్సు కమాన్ పట్టాలు విరిగిపోయాయి.
దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి ఒక వైపుకు ఒరిగిపోయింది. ఇది గమనించిన డ్రైవర్ బస్సు అద్దాలు ధ్వంసం చేసి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాడు. అనంతరం బస్సు స్టీరింగ్ రాడ్ కూడా విరిగి పోవడంతో బస్సు బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని స్వల్ప గాయాలైన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.