
ప్రమాదానికి కారణమైన భాష్యం స్కూల్ బస్
శ్రీకాకుళం, కాశీబుగ్గ : ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పడంతో ఇద్దరు గాయపడిన సంఘటన బుధవారం పలాసలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం సమీపంలో కౌసల్యనగర్ చెందిన దండాసి లచ్చయ్య రిక్షా కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం తన ఇంటి నుంచి కాశీబుగ్గ బస్టాండ్‌కు రిక్షా తీసుకుని వెళ్తుండగా పలాస విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో లచ్చయ్య రిక్షాతో సహా రోడ్డుపై బోల్తాపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఇడ్లీలు అమ్ముకుంటూ నడిచి వెళ్తున్న బరాటం శ్రీనివాసరావును కూడా బస్సు ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులిద్దరినీ పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలందించారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భాష్యం కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులకు సపర్యలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment