చంద్రబాబు సభకు స్కూల్ బస్సులు
కొవ్వూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభకు జనాన్ని తరలించేందుకు స్కూల్ బస్సులను వినియోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు సభకు పంపడంతో కొవ్వూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు గురువారం ఏకంగా సెలవు ప్రకటించేశారు. రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న స్కూల్ బస్సులన్నీ సీఎం సభకు పంపించడంతో గురువారం సెలవు ఇచ్చి ఆదివారం నిర్వహిస్తున్నట్టు కొవ్వూరులో ఓ విద్యాసంస్థ యాజమాన్యం తల్లిదండ్రులకు వర్తమానం పంపారు. ముఖ్యమంత్రి సభకు పాఠశాల బస్సులను పంపి పిల్లల చదువులతో చెలగాటం ఏమిటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
సీఎం పర్యటనలో భాగంగా బుధవారం కామవరపుకోటలో రైతు సదస్సు, 17న కొయ్యలగూడెంలో మహిళ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. కామవరపుకోటలో రైతు సదస్సుకు జిల్లావ్యాప్తంగా రైతు రుణార్హత కార్డులు పొందేవారిని వ్యవసాయ అధికారులు బస్సుల్లో తరలించారు. 236 బస్సుల్లో 11,800 మంది కౌలు రైతులను సదస్సుకు తరలించారు. దీంతో జిల్లాలోని పాఠశాల బస్సులతోపాటు వివిధ సంస్థలకు చెందిన బస్సులు, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసే బాధ్యత స్థానిక రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. కొన్ని బస్సులు బుధవారం, మరికొన్ని గురువారం వెళ్లాలని రవాణాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు.
రవాణాశాఖ అధికారులు చెప్పిన తరువాత బస్సులు పంపకపోతే ఏ ఇబ్బందులు తలెత్తుతాయోనన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో బస్సులు పంపినట్టు ఓ విద్యాసంస్థ ప్రతినిధి తెలిపారు. గురువారం నాటి సభకు జిల్లావ్యాప్తంగా 778 బస్సులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 200 బస్సులను స్వయం సహాయక సంఘ మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్క కొవ్వూరు రెవెన్యూ డివిజన్ నుంచే 153 బస్సులను గురువారం నాటి మహిళా సభకు వినియోగించనున్నారు.