వేంపల్లె: చదువుకోవాలంటే నది దాటాల్సిందే.. వేంపల్లెలో పాపాఘ్ని నదిపై హైలెవెల్ వంతెన లేకపోవడం.. ఉన్న తాత్కాళిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో విద్యార్థులకు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అష్టకష్టాలు పడుతూ.. పెద్దల సాయంతో పిల్లలు నది దాటి బడికెళుతున్నారు. హైలెవెల్ వంతెన నిర్మించాలని అలవలపాడు, ఎగువ తువ్వపల్లె, దిగువ తువ్వపల్లె గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అలిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఆ మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే.. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనేందుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.30.50 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం లేదు. ప్రతి నిత్యం వేంపల్లెకు రావాలంటే వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇటీవల వరుసగా భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ నెల 9వ తేదీన తాత్కాలిక వంతెన తెగిపోయి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మూడు పల్లెల్లో 1500మందికిపైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలు, విద్యార్థులు వేంపల్లెకు రావాలంటే నరకయాతన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment