పాపాఘ్నిపై రూ.60 కోట్లతో కొత్త వంతెన | AP Govt Decision New Bridge Over Papaghni River At YSR Kadapa | Sakshi
Sakshi News home page

పాపాఘ్నిపై రూ.60 కోట్లతో కొత్త వంతెన

Published Sat, Dec 18 2021 12:05 PM | Last Updated on Sat, Dec 18 2021 12:10 PM

AP Govt Decision New Bridge Over Papaghni River At YSR Kadapa - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జిల్లా కమలాపురం సమీపంలోని పాపాఘ్ని నదిపై కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. పాపాఘ్ని నదిపై 1977లో నిర్మించిన భారీ వర్షాల కారణంగా నవంబర్‌ 20న కుంగిపోయిన విషయం తెలిసిందే. మూడు రోజులు వరద గరిష్ట స్థాయికి చేరడంతో ఆ వంతెన కుంగింది. అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే ఆ వంతెన పైనుంచి రాకపోకలను నిలిపేసింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు సమీపంలోని రైలు వంతెన మీద నుంచి నడిచి వెళ్లాల్సివచ్చింది. అది ప్రమాదకరమని గుర్తించిన ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది.

చదవండి: AP Police Academy: త్వరలో ‘అప్పా’ విభజన

కూలిన పాపాఘ్ని వంతెనకు ఓ వైపున పలకలు వేసి పాదచారులు రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించింది. ఇక శాశ్వత చర్యలు సూచించేందుకు చెన్నై ఐఐటీకి చెందిన ఇంజినీరింగ్‌ నిపుణులు బి.నాగేశ్వరరావు, బాలసుబ్రమణియమ్‌లను రప్పించింది. వారిద్దరూ కుంగిన వంతెనను పరిశీలించారు. పాపాఘ్నిపై పాత వంతెనకు సమాంతరంగా కొత్త వంతెన నిర్మించాలని సూచించారు.

దీంతో ఆర్‌ అండ్‌ బి శాఖ ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖకు పంపించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దాదాపు రూ.60 కోట్ల అంచనా వ్యయంతో కొత్త వంతెన నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను రూపొందిస్తున్నారు. అనంతరం టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

పెన్నా వంతెనపై మార్చి నాటికి పియర్‌ నిర్మాణం
వైఎస్సార్‌ జిల్లాలోని జమ్మలమడుగు వద్ద పెన్నానదిపై ఉన్న వంతెనలో కుంగిన శ్లాబ్‌ స్థానంలో కొత్తది నిర్మించాలని నిర్ణయించారు. ఇటీవల భారీ వర్షాలకు ఆ వంతెన ఒక పియర్‌ కుంగింది. వంతెనను పరిశీలించిన చెన్నై ఐఐటీ ఇంజినీరింగ్‌ నిపుణులు మిగిలిన భాగమంతా పటిష్టంగా ఉందని నివేదిక ఇచ్చారు. కుంగిన పియర్‌ స్థానంలో కొత్తగా శ్లాబ్‌ వేస్తే సరిపోతుందని సూచించారు.

దీంతో రూ.10 కోట్లతో శ్లాబ్‌ వేయాలన్న ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పనులను త్వరలో మొదలు పెట్టి మార్చి నాటికి పూర్తిచేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పెన్నానదిలో డైవర్షన్‌ రోడ్డు నిర్మించి నదీ ప్రవాహాన్ని పైపుల ద్వారా మళ్లిస్తున్నారు.మార్చి నాటికి పియర్‌ నిర్మించి వంతెనపై రాకపోకలను అనుమతించాలని ఆర్‌అండ్‌బి శాఖ భావిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement