సాక్షి, హైదరాబాద్: మూసీపై 4 హైలెవల్ వంతెనల నిర్మాణ బాధ్యతల్ని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీకి అప్పగించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. నాలుగు బ్రిడ్జిల అంచనా వ్యయం రూ.168 కోట్లు. వీటి నిర్మాణంతో వానల సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లోనూ రాబోయే అయిదారు దశాబ్దాలపాటు ప్రజలకు సాఫీ ప్రయాణం సాధ్యమయ్యేందుకు క్షేత్రస్థాయి సర్వే, తగిన డిజైన్లు, ఇతరత్రా పనుల కోసం కన్సల్టెన్సీల సేవలు పొందేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.
వీటికి సంబంధించిన డీపీఆర్‌లు మూడు నెలల్లో పూర్తిచేసి, దాదాపు ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి పనుల్లో భాగంగానే అప్రోచ్‌లు, సర్వీస్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, డక్ట్‌లు, సెంట్రల్ మీడియన్‌లు, కెర్బ్‌లు, స్ట్రీట్‌లైట్ల ఏర్పాటు వంటి పనులు సైతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
సర్వేలో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలు..
►రోడ్డు వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు తగిన భద్రత.
►వీలైనంత తక్కువగా భూసేకరణ.
►నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు వీలైనంత తక్కువగా ఉండాలి.
►నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు వినూత్న ఆలోచనలతో, ఆధునిక సాంకేతికతను వినియోగించాలి.
►కొత్త బ్రిడ్జిలు ఇలా ఉండాలి..
►ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నిరంతరం సాఫీ మూవ్‌మెంట్ ఉండాలి.
► బ్రిడ్జి వెడల్పు, లేన్లు పెంచి సామర్థ్యం పెంచాలి.
►ఫుట్‌ఫాత్‌ల కింద టెలికాం, విద్యుత్ తదితర కేబుళ్లకు డక్ట్‌లుండాలి.
►పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన సదుపాయాలుండాలి.
►ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు మార్కింగ్‌లుండాలి.
►మొత్తానికి ప్రజా రవాణా మెరుగవ్వాలి.
పర్యాటక ఆకర్షణగా..
మూసారంబాగ్, చాదర్‌ఘాట్‌ల వద్ద బ్రిడ్జి పనులు పది రోజుల్లో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఇటీవల మూసారాంబాగ్ బ్రిడ్జి ముంపు సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించినప్పటికీ, పనులు మొదలయ్యేందుకు సమయం పట్టనుంది. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియకే మూడునెలలు పట్టనుంది. మూసీపై నిర్మించే బ్రిడ్జిల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వాటికోసం పోటీలు కూడా నిర్వహించారు. డిజైన్లు మంత్రి పరిశీలనలో ఉన్నాయి.
చదవండి: హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి
నిధులెలా..?
నాలుగు బ్రిడ్జిలకు వెరసి రూ. 168 కోట్లు అవసరం కాగా, సదరు నిధుల్ని జీహెచ్‌ఎంసీ ఎలా సమకూర్చుకోనుందో ఇంకా స్పష్టత రాలేదు. డీపీఆర్‌ల తయారీకి మూడునెలల సమయమున్నందున ఆలోగా బ్యాంకులోన్లు తీసుకోవడమో, బాండ్ల ద్వారా సేకరించడమో చేసే అవకాశం ఉంది. లేదా జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే పనులు జరిగేకొద్దీ విడతల వారీగా చెల్లింపులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.
బ్రిడ్జిలు– అంచనా వ్యయాలు..
1.మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు
2. మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి:రూ.52కోట్లు
3.చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి : రూ.42 కోట్లు
4. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు
Comments
Please login to add a commentAdd a comment