High Level Bridge
-
4 వంతెనలు, 3 నెలల్లో టెండర్లు .. మూసీపై బ్రిడ్జీల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: మూసీపై 4 హైలెవల్ వంతెనల నిర్మాణ బాధ్యతల్ని ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అప్పగించడంతో ఆ దిశగా అధికారులు కార్యాచరణకు సిద్ధమయ్యారు. నాలుగు బ్రిడ్జిల అంచనా వ్యయం రూ.168 కోట్లు. వీటి నిర్మాణంతో వానల సమయాల్లోనే కాకుండా అన్ని సమయాల్లోనూ రాబోయే అయిదారు దశాబ్దాలపాటు ప్రజలకు సాఫీ ప్రయాణం సాధ్యమయ్యేందుకు క్షేత్రస్థాయి సర్వే, తగిన డిజైన్లు, ఇతరత్రా పనుల కోసం కన్సల్టెన్సీల సేవలు పొందేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లు మూడు నెలల్లో పూర్తిచేసి, దాదాపు ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బ్రిడ్జి పనుల్లో భాగంగానే అప్రోచ్‌లు, సర్వీస్‌రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, డక్ట్లు, సెంట్రల్ మీడియన్లు, కెర్బ్‌లు, స్ట్రీట్లైట్ల ఏర్పాటు వంటి పనులు సైతం పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వేలో ప్రాధాన్యతనివ్వాల్సిన అంశాలు.. ►రోడ్డు వినియోగదారులకు మెరుగైన సేవలతోపాటు తగిన భద్రత. ►వీలైనంత తక్కువగా భూసేకరణ. ►నిర్మాణ సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు వీలైనంత తక్కువగా ఉండాలి. ►నిర్మాణం త్వరితంగా పూర్తయ్యేందుకు వినూత్న ఆలోచనలతో, ఆధునిక సాంకేతికతను వినియోగించాలి. ►కొత్త బ్రిడ్జిలు ఇలా ఉండాలి.. ►ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా నిరంతరం సాఫీ మూవ్మెంట్ ఉండాలి. ► బ్రిడ్జి వెడల్పు, లేన్లు పెంచి సామర్థ్యం పెంచాలి. ►ఫుట్‌ఫాత్‌ల కింద టెలికాం, విద్యుత్ తదితర కేబుళ్లకు డక్ట్లుండాలి. ►పాదచారులు రోడ్డు దాటేందుకు తగిన సదుపాయాలుండాలి. ►ట్రాఫిక్ సిగ్నళ్లు, రోడ్డు మార్కింగ్లుండాలి. ►మొత్తానికి ప్రజా రవాణా మెరుగవ్వాలి. పర్యాటక ఆకర్షణగా.. మూసారంబాగ్, చాదర్ఘాట్ల వద్ద బ్రిడ్జి పనులు పది రోజుల్లో ప్రారంభించి, 9 నెలల్లో పూర్తి చేయనున్నట్లు ఇటీవల మూసారాంబాగ్ బ్రిడ్జి ముంపు సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించినప్పటికీ, పనులు మొదలయ్యేందుకు సమయం పట్టనుంది. డీపీఆర్ తయారీ, టెండర్ల ప్రక్రియకే మూడునెలలు పట్టనుంది. మూసీపై నిర్మించే బ్రిడ్జిల డిజైన్లు ప్రత్యేకంగా ఉండేందుకు, పర్యాటకులను ఆకట్టుకునేందుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వాటికోసం పోటీలు కూడా నిర్వహించారు. డిజైన్లు మంత్రి పరిశీలనలో ఉన్నాయి. చదవండి: హైటెక్ స్టేషనండి.. రూ. 100 కోట్లతో అభివృద్ధి చేసినా.. బండి ఆగదండి నిధులెలా..? నాలుగు బ్రిడ్జిలకు వెరసి రూ. 168 కోట్లు అవసరం కాగా, సదరు నిధుల్ని జీహెచ్ఎంసీ ఎలా సమకూర్చుకోనుందో ఇంకా స్పష్టత రాలేదు. డీపీఆర్‌ల తయారీకి మూడునెలల సమయమున్నందున ఆలోగా బ్యాంకులోన్లు తీసుకోవడమో, బాండ్ల ద్వారా సేకరించడమో చేసే అవకాశం ఉంది. లేదా జీహెచ్ఎంసీ ఖజానా నుంచే పనులు జరిగేకొద్దీ విడతల వారీగా చెల్లింపులు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే. బ్రిడ్జిలు– అంచనా వ్యయాలు.. 1.మూసీపై ఇబ్రహీంబాగ్ కాజ్‌వేను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి :రూ. 39 కోట్లు 2. మూసారాంబాగ్‌ను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జి:రూ.52కోట్లు 3.చాదర్‌ఘాట్ వద్ద హైలెవెల్ బ్రిడ్జి : రూ.42 కోట్లు 4. అత్తాపూర్ వద్ద ఉన్న బ్రిడ్జికి సమాంతరంగా కొత్త బ్రిడ్జిలు:రూ.35కోట్లు -
ప్రమాదకరంగా కిన్నెరసాని వాగు: కట్టెల సాయంతో..
సాక్షి, ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, అళ్ళపల్లి మండలాల్లో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మండలాల్లో ఉన్న కిన్నెరసాని, మల్లన్న, కోడిపుంజుల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆళ్లపల్లి మండలంలో మోదుగుల గూడెం, సజ్జల బోడు గ్రామాల మధ్య కిన్నెరసాని వాగుపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆదివాసీలు కర్రల సహాయంతో వంతెన తయారు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. సోమవారం పొద్దుటే వ్యవసాయ పనులకు వెళ్లిన గిరిజనులు సాయంత్రం తిరిగి వచ్చే వేళకు కిన్నెరసాని నది పొంగింది. దాన్ని దాటితేనే ఇంటికి చేరుతారు. దీంతో చేసేదేం లేక కట్టెల సాయంతో నిచ్చెన మాదిరి ఏర్పాటు చేసుకుని వాగు ప్రవాహాన్ని అతికష్టం మీద దాటారు. చాలా ప్రమాదకరంగా ఇబ్బందులు పడుతూ వాగు దాటిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గుండాల మండల కేంద్రంలో కూలి పనులు, వ్యవసాయ పనిముట్లు, విత్తనాల కొనుగోలుకు రైతులు కూలీలు నిత్యం గుండాల మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. వాగు దాటడం ప్రమాదమని తెలిసినా సాహసం చేయక తప్పట్లేదు అంటున్నారు. గతంలో వాగు దాటే క్రమంలో వరద ఉధృతికి కొట్టుకొని పోయి ఇద్దరు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయని ఏళ్లు గడిచినా బ్రిడ్జి పనులు పనులు పూర్తిచేయడం లేదన్నారు. దీంతో ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని వాగు దాటే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బ్రిడ్జి పనులను పూర్తి చేసి ఏజెన్సీ వాసుల కష్టాలను తీర్చాలని ఆదివాసీలు వేడుకుంటున్నారు. -
హైలెవల్ బ్రిడ్జి..అభూత కల్పనే
సాక్షి, గుంటూరు : తోట్లవల్లూరు–పాములలంక మధ్య కృష్ణానదిపై వంతెన నిర్మాణం కలగా మారింది. రాజధాని నిర్మాణం నుంచి గ్రామస్థాయి పనుల వరకు టీడీపీ సర్కార్ చేస్తున్న గ్రాఫిక్స్ మాయలో పాములలంక హైలెవల్ బ్రిడ్జి ‘అభూత కల్పన’లాగే మిగిలిపోయింది. ఆరు నెలల నుంచి ఇదిగో వంతెన నిర్మాణం, అవిగో పనుల ప్రారంభం అంటూ ఊరిస్తూ..ఉసూరుమనిపించిన టీడీపీ నేతల మాయాజాలంపై సాక్షి ప్రత్యేక కథనం. వివరాలలోకి వెళితే..కృష్ణానది గర్భంలో పాములలంక గ్రామం ఉంది. సుమారు 1500 జనాభా నివసిస్తున్నారు. వీరంతా దళితులు. వ్యవసాయా«న్ని నమ్ముకునే గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. తోట్లవల్లూరుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. మామూలు సమయాలలో తాత్కాలిక రహదారిపై ప్రయాణించే స్థానికులు, వరదల సమయంలో పడవలపై రాకపోకలు సాగిస్తుంటారు. రూ.30 కోట్లు మంజూరు కృష్ణానదిపై తోట్లవల్లూరు–పాములలంక మధ్య హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అనేక ఏళ్లుగా కోరుతున్నారు. గత కాంగ్రెస్ పాలనలో వంతెన నిర్మాణానికి రూ.13 కోట్లు మంజూరై, శంకుస్థాపన జరిగి కూడా పనులు ప్రారంభం కాలేదు. తాజాగా గత ఏడాది కాలంగా వంతెన నిర్మాణానికి ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.30 కోట్లు మంజూరయ్యాయని, పనులు త్వరలో ప్రారంభిస్తామని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన చెబుతూ వచ్చారు. గత డిసెంబర్లో సీఎం సతీమణి భువనేశ్వరి దత్తత గ్రామం పామర్రు మండలం కొమరవోలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పనులకు సంభందించిన శిలాఫలకం కూడా ఆవిష్కరిస్తారని అప్పట్లో ప్రకటించారు. జాడలేని పనులు వంతెన నిర్మాణానికి అడ్డంకిగా మారిన భూసేకరణ జరపకుండా, వంతెన నిర్మాణ పనులను దక్కించుకున్న వల్లభనేని కన్స్ట్రక్షన్ కంపెనీ గత నాలుగు నెలల కిందట నిర్మాణ ప్రాంతంలో కొంత హడావుడి చేసింది. సిబ్బంది కోసం తాత్కాలిక నివాసాలను ఏర్పాటు చేయటంతోపాటు కొంత నిర్మాణ సామాగ్రి, యంత్రాలను కూడా నిర్మాణ ప్రదేశానికి తరలించింది. వంతెన పనులను మాత్రం ఇంతవరకు ప్రారంభించలేదు. నిర్మాణ పనుల కోసం వచ్చిన క్షేత్రస్ధాయి సిబ్బంది కూడా రెండు నెలలుగా కానరావటం లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారని ఎమ్మెల్యే కల్పన చెబుతుండగా, మరి వంతెన పనులు జరపకుండా నిర్మాణ సంస్థ ఎందుకు ఉంటోందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అసలు చంద్రబాబు శంకుస్థాపన చేశారా లేదా లేక ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికి టీడీపీ నేతలు ఏమైనా డ్రామా ఆడుతున్నారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. వంతెన పేరుతో గత పదేళ్లుగా తమను పాలకులు మోసం చేస్తూనే ఉన్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ఎందుకు ప్రారంభించరు తోట్లవల్లూరు–పాములలంక మధ్య వంతెన నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఎమ్మెల్యే కల్పన గత కొన్ని నెలలుగా చెబుతూ వస్తున్నారు. పనుల శిలాఫలకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించాడని కూడా సభల్లో చెబుతున్నారు. వంతెన పనుల కోసం నిర్మాణ సామగ్రిని కూడా తరలించిన కాంట్రాక్టర్ పనులను ఎందుకు నిలిపివేశాడో అర్థం కావటం లేదు. -సోలే నాగరాజు, పాములలంక -
చదువుకోవాలంటే నది దాటాల్సిందే..?
వేంపల్లె: చదువుకోవాలంటే నది దాటాల్సిందే.. వేంపల్లెలో పాపాఘ్ని నదిపై హైలెవెల్ వంతెన లేకపోవడం.. ఉన్న తాత్కాళిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో విద్యార్థులకు, ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. అష్టకష్టాలు పడుతూ.. పెద్దల సాయంతో పిల్లలు నది దాటి బడికెళుతున్నారు. హైలెవెల్ వంతెన నిర్మించాలని అలవలపాడు, ఎగువ తువ్వపల్లె, దిగువ తువ్వపల్లె గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అలిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని ఆ మూడు గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే.. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొనేందుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హై లెవెల్ వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద రూ.30.50 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా అమలుకు నోచుకోలేదు. ఆ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం లేదు. ప్రతి నిత్యం వేంపల్లెకు రావాలంటే వరద నీటిలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఇటీవల వరుసగా భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాలనుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ నెల 9వ తేదీన తాత్కాలిక వంతెన తెగిపోయి ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మూడు పల్లెల్లో 1500మందికిపైగా జనాభా ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలు, విద్యార్థులు వేంపల్లెకు రావాలంటే నరకయాతన పడుతున్నారు. -
హైలెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన ఈటల
మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : మానకొండూరు మండలంలో నిర్మిస్తున్న హైలెవెల్ బ్రిడ్జికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ హైలెవెల్ బ్రిడ్జిని జేగురుపల్లి, నీరుకొల్లు గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మిస్తున్నారు. దీనికి ప్రభుత్వం రూ.40 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఈటల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్‌తోపాటు పలువురు శాసనసభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
అడ్డుకట్టపై భక్తుల ఆగ్రహం
ముల్లకట్ట బ్రిడ్జిపై రాకపోకలు బంద్ సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిడ్జిపై రాకపోకలను నియంత్రిం చేందుకు ఏర్పాటుచేసిన ఔట్‌పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు గురువారం భక్తుల నిరసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. మావోయిస్టులు లేనేలేరని చెప్పే పోలీ సులు.. పుష్కరస్నానం కోసం వచ్చే భక్తులకు ఇలా ఇబ్బంది కలిగించడం ఏమిటని ప్రశ్నించారు. బ్రిడ్జిపై నుంచి వెళ్లేందుకు తమను అనుమతించాలంటూ ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు నడకదారిలో వచ్చేందుకు కొంతసేపు భక్తులను అనుమతించారు. మావోయిస్టులు వస్తారనే కారణం చూపుతూ ముల్లకట్ట బ్రిడ్జిపై భక్తుల రాకపోకలపై పోలీసులు బుధవారం సాయంత్రం నుంచి నిషేధం విధిం చారు. మావోయిస్టుల అంశంతోపాటు పుష్కర పనులు చేసిన కాంట్రాక్టర్లను సంతృప్తి కలిగిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పుష్కర స్నానానికి అనుకూలంగాలేని ముల్లకట్టలో ఘాట్‌ను నిర్మించడంపైనే విమర్శలు తలెత్తుతున్నాయి. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని వరంగల్ జిల్లాలో గోదావరి తీరం వెంట మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టలో పుష్కరస్నానాలకు అనుగుణంగా ఘాట్లను నిర్మిం చారు. ముల్లకట్ట వద్ద అవసరం లేకున్నా, సౌకర్యంగా ఉం డకున్నా రూ.4 కోట్లతో ఇక్కడ ఘాట్ నిర్మించి, నీటి పంపులు ఏర్పాటు చేశారు. పుష్కరాలు మొదలైనా ముల్లకట్ట వద్ద ఘాట్‌కు సమీపంలో గోదావరి ప్రవాహం లేదు. దీంతో భక్తులకు ఘాట్‌లో పుష్కరస్నానం చేసే సౌకర్యం లేకుండాపోయింది. ముల్లకట్టలో పుష్కరఘాట్ ఏర్పాటు ప్రతిపాదన తప్పనే విషయం బయటపడకుండా ఉండేం దుకు.. అధికారులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల నిషేద నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.