పెద్దల సమక్షంలో పెళ్లి... అయింది పెద్ద లొల్లి!
మండలంలోని ఇప్పలవలస గ్రామానికి చెంది న ఉపాధ్యాయుడు కొండపల్లి సత్యనారాయణ, అదే గ్రామానికి చెందిన చింత కల్యాణి ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని కల్యాణి కొంతకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఇదిగో.. అదిగో అంటూ సత్యనారాయణ వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు. దీంతో కల్యాణి బుధవారం ఆండ్ర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై పిసిని నారాయణరావు.. సత్యనారాయణను స్టేషన్‌కు రప్పిం చి కౌన్సెలింగ్ ఇచ్చారు.
చివరకు కల్యాణిని పెళ్లి చేసుకోవడానికి సత్యనారాయణ అంగీకరించాడు. అదే రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో మెంటాడ లో ఉన్న శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇప్పలవలస ఎంపీటీసీ సభ్యుడు చింత కాశీనాయుడు, కొండలింగాలవలస మాజీ సర్పంచ్ ఎస్.తిరుపతి, పలువురు గ్రామ పెద్దల సమక్షంలో ఇరువురికీ వివాహం జరిపించారు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉం ది. సినిమా స్టోరీ మాదిరి అంతా ఉత్కంఠగానే సాగిం ది. ప్రేమకథ మాదిరి ప్రశాంతంగా ముగిసిందని అంతా భావించారు. మరి సినిమా స్టోరీ అంటే ఆ మాత్రం ట్విస్ట్‌లు ఉండాలి కదా..! ఈ కథకూ అలాంటి ట్విస్ట్ లభించింది. అది ఎలా అంటే...
ఇది వరకే తనను వివాహం చేసుకున్నాడంటూ...
ఈ కథలోకి తాజాగా ఓ ఉపాధ్యాయిని ప్రత్యక్షమైంది. గత మే నెల 1వ తేదీన విజయనగరంలోని నూకాలమ్మ ఆలయంలో ఉపాధ్యాయుడు సత్యనారాయణ తనను వివాహం చేసుకున్నాడంటూ మండలంలోని పోరాం గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని నిమ్మకాయల వెంకటమ్మ గురువారం విజయనగరం లీగల్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. వివాహ సమయంలో తాము తీయించుకున్న ఫొటోలను ఆధారాలుగా ఆమె చూపించారు. సత్యనారాయణ తల్లిదండ్రులు నూతనంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఈ నెల 18న భూమి పూజ చేశారని, ఆ కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని తెలిపింది. ఇంటి స్థలం కూడా తన పేరు మీదే ఉందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. తన భర్త సత్యనారాయణకు కల్యాణిని ఇచ్చి గ్రామ పెద్దలు బలవంతంగా వివాహం చేశారని తెలిపింది. తనపైన, తన భర్తపైన లేనిపోని ఆరోపణలు చేసి, కల్యాణి మోసం చేసిందని ఆరోపించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు కదిలిన డీఎస్పీ..
విజయనగరం ఎస్పీ ఆదేశాల మేరకు బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్ శుక్రవారం ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఘటనపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయురాలు వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వెంకటమ్మ, కల్యాణిల నుంచి వివరాలు సేకరించామని తెలిపారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందని చెప్పారు. విచార ణ పూర్తయ్యూక నివేదికను ఎస్పీకి అందిస్తామని తెలిపారు. ఆయన వెంట గజపతి నగరం సీఐ చంద్రశేఖరరావు, ఆండ్ర ఎస్సై పిసిని నారాయణరావు ఉన్నారు.