సమైక్యాంధ్ర ఉద్యమంతో చదువు గుదిబండ | schools are closed due to samaikyandhra bandh | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర ఉద్యమంతో చదువు గుదిబండ

Published Tue, Dec 31 2013 12:17 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

schools are closed due to samaikyandhra bandh

 కర్నూలు(విద్య), న్యూస్‌లైన్:
 2013కు విద్యార్థులు ఘన వీడ్కోలు పలకలేని పరిస్థితి. అలాగే 2014 వస్తుందని సంబరాలు చేసుకోలేని దుస్థితి. అవిశ్రాంతంగా తరగతులు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జిల్లాలో విద్యారంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ విద్యారంగం వరకు సిలబస్ తారుమారైంది. ఫలితంగా విద్యార్థులు తక్కువ కాలంలో ఎక్కువ సిలబస్ ఒంటబట్టించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే టెన్త్, ఇంటర్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ప్రధానంగా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సాక్షి బుక్‌లెట్స్ ప్రధాన భూమిక పోషించాయని ఉపాధ్యాయులే ఒప్పుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్ నుంచే పదో తరగతి విద్యార్థులకు సాక్షి బుక్‌లెట్స్‌ను పంపిణీ చేయడం ప్రారంభించింది. జాతీయ, రాష్ట్రస్థాయీ పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఆశించినంత ర్యాంకులు సాధించలేదనే చెప్పాలి. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు స్థానిక ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల విద్యార్థిని రుక్మిణి ఎంపికయ్యింది. ఈమె జాతీయ స్థాయి బెస్ట్‌కేడెట్‌గా ఎంపికై  రాష్ట్రం తరుఫున రిపబ్లిక్‌డే క్యాంపులో పాల్గొన్నారు. ఆగస్టు 22 నుంచి ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు నెలరోజుల పాటు పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా సుబ్బారెడ్డి, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా జయసింహారెడ్డి ఎంపిక కావడం విశేషం.
 
  పాఠశాల
  జిల్లా విద్యాశాఖాధికారిగా కె. నాగేశ్వరరావు మే 17వ తేదీన బాద్యతలు స్వీకరించారు. కార్యాలయ ఏడీలుగా శ్రీరాములు, యాదయ్య బాధ్యతలు తీసుకున్నారు.
 
  గత ఏడాది ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో జిల్లా 91.55 శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్రంలో 7వ స్థానం సాధించడం విశేషం. జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, అప్పటి డీఈవో బుచ్చన్న తీసుకున్న ప్రత్యేక చర్యతో ఈ ఏడాది ఫలితాల శాతం పెరిగింది. ముఖ్యంగా జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు.
 
  సమైక్యాంధ్ర  ఉద్యమ నేపథ్యంలో ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేకపోయారు. దాదాపు నెలన్నర పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విద్యాసంవత్సర క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సవరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ పాఠశాలలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.
 
  విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయుల ఆటకట్టించేందుకు డీఈవో నాగేశ్వరరావు ప్రతిరోజూ పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొందరు ఉపాధ్యాయుల తీరులో మార్పు రాలేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
 
  మే నెలలో 4,887 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకోగా వారిలో 1,113 మంది మాత్రమే బదిలీ అయ్యారు.
 
  పదోన్నతుల కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన 90 మంది ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
 
  ఈ ఏడాది జిల్లాలో ఎట్టకేలకు అసౌకర్యాల మధ్య మొదటి విడతలో 30 మోడల్ స్కూళ్లను విద్యాశాఖ ప్రారంభించింది. రెండో విడతలో మరో ఏడు మోడల్ స్కూళ్లు జిల్లాకు మంజూరయ్యాయి.
 
  జిల్లాలోని కేజీబీవీ స్కూళ్లలో 34 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించగా, అప్పటికే విధుల్లో ఉన్న వారు కోర్టుకు వెళ్లడంతో ప్రతి పాఠశాలలో ఇద్దరు అధికారులు విధులు నిర్వహిస్తున్నారు.
 
  ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ ఏడాది సాక్షరభారత్ సహకారంతో ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొత్తగా జిల్లాలో 60 డీఎడ్ కళాశాలలు నెలకొల్పారు. అయితే వీటి అనుమతులకు సంబంధించి పలు అక్రమాలు జరిగినా అధికారులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఒక్కో పోస్టును రూ.1.50 లక్షలకు అమ్ముకుంటున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపించాయి.
 
 కళాశాల..
 ఆర్‌ఐవోగా పరమేశ్వరయ్య స్థానంలో కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యేశ్వరరావు బాధ్యతలు తీసుకున్నారు. మే 16న తేదీన డీవీఈవోగా సాలాబాయి బాధ్యతలు చేపట్టారు.
  జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయని భయపెట్టిన ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు యధావిధిగా పాత పద్ధతిలోనే  ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి.
 
  ఏప్రిల్ 26న ఫలితాలు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే 5 శాతం అధికంగా ఫలితాలు సాధించారు. 990 మార్కులతో సాయిప్రియాంక అనే విద్యార్థిని జిల్లా టాపర్‌గా నిలిచింది.  ప్రభుత్వ జూనియర్ వృత్తి విద్యాకళాశాలల్లో ప్రయోగశాలల వసతుల కల్పనకు రూ.42లక్షలు విడుదల చేశారు.
 
 ఉద్యమ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చిన ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ఆగస్టు 21న ప్రారంభమైంది. రెండు, మూడు రోజుల పాటు అవాంతరాలు ఎదురైనా ప్రశాంతంగా ముగిసింది.
 
 విశ్వవిద్యాలయం
  రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పుల్లారెడ్డి స్థానంలో ఆచార్య ఎ. ఆనందాచారి నియమితులయ్యారు. మూడు నెలల పాటు విధులు నిర్వహించిన ఆయన వ్యక్తిగత కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో మరోసారి ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్‌ను వరించింది. ప్రిన్సిపల్‌గా కొనసాగుతూనే ఆయన అదనపు బాధ్యతలుగా రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్నారు.
 
  ఆర్‌యూలో నీటి సమస్య కారణంగా పీజీ తరగతులు 45 రోజుల పాటు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
  ఈ ఏడాది కొత్తగా ఆర్‌యూలో యూజీ, పీజీ దూర విద్యను ప్రారంభించారు.  ఎట్టకేలకు యుజీసీ 12 బి బృందం వర్సిటీని సందర్శించి పలు విభాగాలను పరిశీలించింది.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement