
పాఠశాలలు ‘ఫెయిల్’!
రాష్ర్టంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులు తరగతులు దాటుతున్నారే కాని అక్షరాలు, లెక్కలు మాత్రం నేర్వడంలేదు.
తరగతులు దాటుతున్నా చదవడం రాని విద్యార్థులు
ఐదో తరగతిలో భాగించడం వచ్చిన వారు 36.2 శాతమే
రెండో తరగతి పుస్తకాలను కూడా చదవలేనివారు 42 శాతం మంది
బాలికలకు టాయిలెట్లు ఉన్న పాఠశాలలు 43 శాతమే
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. విద్యార్థులు తరగతులు దాటుతున్నారే కాని అక్షరాలు, లెక్కలు మాత్రం నేర్వడంలేదు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని ఆరో తరగతిలో ప్రవేశించే ప్రతి 10 మంది విద్యార్థుల్లో ఆరుగురికి భాగించడమే రాదని ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన వార్షిక విద్యా స్థితి (అసర్-2013) నివేదికలో వెల్లడైంది. ఐదో తరగతిలో భాగించడం వచ్చిన వారు 36.2 శాతం మాత్రమే.
ఐదో తరగతికి వచ్చినా రెండో తరగతిలోని పాఠ్యాంశాలు చదవగలిగిన వారు 58 శాతమే. ఇక మూడో తరగతిలో తీసివేత చేయగలిగిన వారు 38.1 శాతమే ఉండగా, రెండో తరగతిలో అక్షరాలను గుర్తించలేని వారు 11.4 శాతం కాగా వాక్యాలను చదవలేని వారు 35.2 శాతం మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను ఇటీవల ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా విడుదల చేశారు. దేశవ్యాప్త నివేదికతోపాటు రాష్ట్రాల వారీగా నివేదికలు రూపొందించినట్లు ప్రథమ్ ప్రాజెక్టు డెరైక్టర్ సునీత బుర్రా వెల్లడించారు. రాష్ట్రంలో 21 జిల్లాల్లోని 616 పాఠశాలల్లో ఈ సర్వే నిర్వహించామని, 621 గ్రామాల్లోని 15,841 మంది విద్యార్థుల అభ్యసన స్థాయిని పరిశీలించామని చెప్పారు.
బాలికల టాయిలెట్లు 43 శాతమే: రాష్ట్రంలో 43 శాతం స్కూళ్లలోనే బాలికలు ఉపయోగించేలా ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 53.3 శాతం ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. ఇక స్కూళ్లలోని కామన్ టాయిలెట్లలో 55.1 శాతమే ఉపయోగించడానికి వీలుగా ఉన్నాయి. తాగునీటి సదుపాయం 65.1 శాతం స్కూళ్లలోనే ఉంది. గత ఏడాది ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి 56.4 శాతం ఉండగా ఈసారి 45.8 శాతానికి తగ్గింది.
టీచర్ల హాజరు తక్కువే: ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరులోనూ మన రాష్ట్రం వెనుకబడే ఉంది. 1నుంచి 8వ తరగతి వరకున్న స్కూళ్లలో విద్యార్థుల హాజరు మహారాష్ట్రలో 89.5 శాతం, కర్ణాటకలో 83.9 శాతం, తమిళనాడులో 91.3 శాతం, కేరళలో 89 శాతం ఉండగా మన రాష్ట్రంలో 74.9 శాతం ఉంది. ఉపాధ్యాయుల హాజరు మహారాష్ట్రంలో 92.3 శాతం, కర్ణాటకలో 88 శాతం, తమిళనాడులో 88.4 శాతం, కేరళలో 89.2 శాతం ఉండగా మన రాష్ట్రంలో 80 శాతం మాత్రమే ఉంది.
మరికొన్ని ప్రధాన అంశాలు...
- 6 నుంచి 14 ఏళ్లలోపు వారిలో 97.1 శాతం విద్యార్థులు 2013లో పాఠశాలల్లో చేరారు. ఇందులో ప్రైవేటు స్కూళ్లలో చేరిన వారు 34 శాతం.
- ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్న వారి సంఖ్య 2006లో 18.5 శాతం ఉండగా 2012 నాటికి 36.5 శాతానికి పెరిగింది. బాలికలకంటే బాలురే ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్లలో చేరుతున్నారు.
- ఒకటో తరగతిలో అక్షరాలు చదవలేని వారు 2011లో 19.6 శాతం ఉండగా, 2013లో 36.1 శాతం ఉంది. అంటే 15 శాతం పెరిగింది.
- రెండో తరగతిలో 40 శాతం మంది విద్యార్థులు సులభమైన పదాలు కూడా చదవలేకపోతున్నారు. పాఠ్యాంశాలు చదవడం, నేర్చుకోవడం, లెక్కలు చేయగలిగే వారి సంఖ్య ప్రైవేటు స్కూళ్లలోనే ఎక్కువగా ఉంది.
- విద్యార్థుల్లో రెండో తరగతి నుంచే చదవడం, రాయడం, ఆలోచించడం, లెక్కలు చేయడంపై ప్రత్యేక దృష్టి అవసరం. 12వ పంచవర్ష ప్రణాళికలో వీటికే ప్రాధాన్యం. 2014-15లో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సర్వశిక్షా అభియాన్ మార్గదర్శకాలను జారీ చేసింది.