బడిగంట.. మోగేది నేడే
అనంతపురం ఎడ్యుకేషన్: పిల్లలకు వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. వాటిలో సమస్యలు మాత్రం యథాతథంగానే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సిద్ధంగా లేవు. ఖాళీ సంచులతో బడికెళ్లాల్సిన పరిస్థితి. యూనిఫాం కూడా ఇప్పట్లో అందే సూచనలు కన్పించడం లేదు.
జిల్లాలో 2,956 ప్రాథమిక, 596 ప్రాథమికోన్నత, 590 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,00,417 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2,86,487 మంది, ఉన్నత పాఠశాలల్లో 1,92,268 మంది కలిపి మొత్తం 6,79,172 మంది విద్యార్థులు ఉన్నారు. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేవు. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను వేధిస్తోంది. మధ్యాహ్న భోజనం వండేందుకు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఆరుబయటే వంట చేయాల్సిన దుస్థితి. అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుం టుండడంతో సమస్యలు తీరడం లేదు. సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా మంచినీళ్ల ప్రాయంలా నిధులు ఖర్చు చే స్తున్నా...క్షేత్రస్థాయిలో ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.
45 శాతం పుస్తకాలు రావాలి..
పభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఆయా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలను సిద్ధంగా ఉంచాలి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇంకా 45 శాతం పుస్తకాలు జిల్లాకు రావాల్సి ఉంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1-10వ తరగతి విద్యార్థులకు అన్ని మాధ్యమాలకు సంబంధించి 26,74,241 పుస్తకాలు అవసరం. వీటిలో ఆదివారం నాటికి 14,68,236 (54.9 శాతం) వచ్చాయి. ఇంకా 12,06,005 (45.1 శాతం) రావాలి. జిల్లాకు వచ్చినవాటిలో ఆయా మండలాలకు చేరింది 11,83,420 పుస్తకాలు మాత్రమే. ఇంకా 2,84,816 జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి మండలాలకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. మండలాలకు చేరినంత మాత్రాన పిల్లలకు సకాలంలో అందవు. అక్కడి నుంచి పాఠశాలలకు తరలించాల్సి ఉంది.
యూనిఫాం ఏదీ?
ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి పిల్లలకు ఉచితంగా ఇచ్చే యూనిఫాం ఇప్పట్లో అందేలాలేదు. జిల్లాలో 1-8వ తరగతి విద్యార్థులు 3,15,907 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 6,31,814 జతలు అవసరం. పాఠశాలల ప్రారంభంలోనే పిల్లలకు యూనిఫాం అందజేస్తామని అధికారులు చేసిన ప్రకటనలు ప్రచారానికే పరిమితమయ్యాయి. మండలాలకు క్లాత్ సరఫరా విషయంలో అధికారులకే స్పష్టత లేదు. ఆప్కోకు ఇండెంట్ పంపే పనిలో ఉన్నారు. ఇండెంట్ తీసుకుని పూర్తిస్థాయిలో క్లాత్ జిల్లాకు చేరి.. స్టిచ్చింగ్ చేసి పిల్లలకు పంపిణీ చేసేందుకు మరో 3-4 నెలలు పట్టే అవకాశముంది. అప్పటిదాకా పిల్లలు చిరిగిన పాత యూనిఫాంతోనే పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి.
25 శాతం లేనట్లేనా!
విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శా తం సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలి. ఈ నిబంధన ఈసారీ అమలయ్యే సూచనలు కన్పించడం లేదు. మూడేళ్ల కిందటే అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.