ఈయన పేరు గురుమూర్తి. కంబదూరు మండలం ఎగువపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. సమయానికి రావడం.. బయోమెట్రిక్ వేసి ఇంటిబాట పట్టడం ఈయన దినచర్య. పాఠశాల ముగిసే సమయానికి ఠంచనుగా చేరుకొని బయోమెట్రిక్ వేసి వెళ్లడంతో ఈ సారు ఉద్యోగం ముగుస్తుంది. ఇప్పటికి లెక్కలేనన్ని ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం. టీడీపీ కార్యకర్తగా చెలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం, ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి నమ్మిన బంటు కావడంతోనే ఈ బడిపంతులు ఆడిందే ఆట, పాడిందే పాట.
అనంతపురం కళ్యాణదుర్గం: కంబదూరు మండలం ఎగువపల్లి(వైసీ పల్లి) ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) పనిచేస్తున్నారు. 65 మంది విద్యార్థులు ఉన్నారు. సీనియర్ ఎస్‌జీటీ సుధాకర్ ఇన్‌చార్జి హెచ్‌ఎంగా వ్యవహరిస్తున్నారు. హెచ్‌ఎం ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురుమూర్తి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నాడు. అంతేకాదు.. తాత్కాలికంగా వరలక్ష్మి అనే అమ్మాయిని విద్యావలంటీర్‌గా నియమించుకుని తన సొంత వ్యవహారాల్లో మునిగి తేలుతున్నాడు. పది నెలల క్రితం కుటుంబ సభ్యుల పేరుతో నూతిమడుగులో పెట్రోల్ బంకును దక్కించుకున్నాడు. ఈ బంకు నిర్వహణే ఇప్పుడు ఆయనకు కీలకంగా మారింది. 2018 జనవరిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు గురుమూర్తిపై ఫిర్యాదు చేసినా చర్యలు కరువయ్యాయి. ఫిర్యాదు చేసినప్పుడు రెండ్రోజులు విధులకు సక్రమంగారావడం, తిరిగి యథావిధిగా బయోమెట్రిక్ నమోదు చేసిన వెంటనే సొంత పనులకు వెళ్లిపోవడం జరుగుతోంది. దీంతో విద్యార్థుల చదువు అటకెక్కింది. నెలకు వేలాది రూపాయల వేతనం తీసుకునే ఉపాధ్యాయుడు బాధ్యతను విస్మరించి విధులకు ఎగనామం పెడుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
టీడీపీ కార్యకర్తగా చెలామణి
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణం. అయితే ఏకంగా టీడీపీ పార్టీ నిర్వహించే ‘గ్రామదర్శిని–గ్రామ వికాసం’ కార్యక్రమంలో పాల్గొంటూ తనకు టీడీపీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఇటీవల సదరు ఉపాధ్యాయుడు తన స్వగ్రామం నూతిమడుగులో నిర్వహించిన టీడీపీ గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. ఇదే కాదు.. నూతిమడుగులో టీడీపీ చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా ఆయన ఒక్కోసారి ప్రత్యక్షంగానూ, కొన్నిసార్లు పరోక్షంగానూ తన పాత్ర పోషిస్తుంటాడు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
విద్యావలంటీర్‌కు వేతనం ఇవ్వం
పాఠశాలలో పనిచేస్తున్న తాతాల్కిక విద్యా వలంటీర్ వరలక్ష్మికి వేతనం ఇవ్వం. పిల్లలకు చదువు చెప్పేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. బయోమెట్రిక్ నమోదు చేసి బయటికి వెళ్లిపోతున్న ఉపాధ్యాయుడు గురుమూర్తి విషయాన్ని విద్యాశాఖ అధికారులకు దృష్టికి తీసుకెళ్లాం. ఇలాంటి ఉపాధ్యాయుల వల్ల తల్లిదండ్రులతో మాట పడాల్సి వస్తోంది.– సుధాకర్, హెచ్‌ఎం
= నా పేరు రమేష్, వైసీ పల్లి గ్రామం. నా కుమారుడు ధనుష్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఉపాధ్యాయుడు గురుమూర్తి పిల్లలకు చదువులు చెప్పకుండా సొంత పనులు చూసుకుంటున్నాడు. ఉన్నతాధికారులు స్పందించాలి.
ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలి
ఎగువపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గురుమూర్తిని నెలల తరబడి పిల్లలకు చదువు చెప్పకుండా సొంత పనులు చూసుకుంటున్నాడు. బయోమెట్రిక్ నమోదు చేయడం, వెళ్లిపోవడం.. సాయంత్రం తిరిగి పాఠశాలకు వచ్చి బయోమెట్రిక్ నమోదు చేస్తున్నాడు. పిల్లల చదువు పూర్తి అధ్వానంగా మారింది. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకుని పాఠశాలలో బోధనను చక్కదిద్దాలి.
– తిరుపాల్, తాజా మాజీ సర్పంచు, వైసీ పల్లి
Comments
Please login to add a commentAdd a comment