బడికొచ్చేవారే లేరు! | Studnets Nill in Summer Special Classes Anantapur | Sakshi
Sakshi News home page

బడికొచ్చేవారే లేరు!

Published Wed, May 8 2019 12:37 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Studnets Nill in Summer Special Classes Anantapur - Sakshi

ఇది అనంతపురం రూరల్‌ పాపంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌బాబు రెమిడియల్‌ తరగతులు (సవరణాత్మక బోధన) నిర్వహించేందుకు స్కూల్‌కు వచ్చాడు. ఈ స్కూల్‌లో 6–8 తరగతుల పిల్లలు 307 మంది ఉండగా...ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. దీంతో ఆయన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ‘మీ పిల్లలను బడికి పంపండి’ అంటూ బ్రతిమిలాడాడు. ఇంతచేస్తే 19 మంది మాత్రమే వచ్చారు. వీరిలోకూడా 9 మంది పదో తరగతికి వెళ్లే విద్యార్థులున్నారు. అంటే 6–8 తరగతులు విద్యార్థులు కేవలం 10 మంది మాత్రమే వచ్చారు. జిల్లాలో సాగుతున్న రెమిడియల్‌ తరగతుల నిర్వహణకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

అనంతపురం ఎడ్యుకేషన్‌: కరువు మండలాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న రెమిడియల్‌ తరగతులకు (సవరణాత్మక బోధన) విద్యార్థుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలోని 32 కరువు మండలాల్లో 1,80,239 మంది విద్యార్థులు చదువుతుండగా... రెమిడియల్‌ తరగతులకు 15 వేలమంది కూడా హాజరుకావడం లేదు. పైగా వచ్చిన విద్యార్థులు కూడా భోజనం తినేసి వెళ్తున్నారు. వేసవి సెలవులకు రెండు రోజుల ముందు  కరువు మండలాల్లోని స్కూళ్లలోమధ్యాహ్నం భోజనం అమలు  చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... సెలవులు ఇచ్చిన నాలుగు రోజులకు ఆయా స్కూళ్లలో రెమిడియల్‌ తరగతులు నిర్వహించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయులపై రుద్ది అమలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో టీచర్లకు సెలవుల్లో పిల్లలను బడికి రప్పించడం సవాల్‌గా మారుతోంది. ఈ కార్యక్రమం వల్ల టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం తప్పితే... విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత అంటూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రణాళిక లేకపోవడంతో కార్యక్రమం నవ్వుల పాలవుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో టీచర్లు బడులకు వెళ్తున్నా... పిల్లలు రావడం లేదు. 

మ్యాగజైన్లు చదువుతున్న పిల్లలు
రెమిడియల్‌ తరగతుల అమలులో కీలకంగా ఉన్న వర్క్‌షీట్లు ఇప్పటిదాకా జిల్లాకు రాలేదు. అరకొరగా వస్తున్న పిల్లలకు ఏమి చదివించాలో టీచర్లకు అర్థం కావడం లేదు. చాలా చోట్ల పాత మ్యాగజైన్లను తీసుకుని పిల్లల చేతికిచ్చి చదువుకోమని సలహా ఇస్తున్నారు. మరికొన్ని చోట్ల మీరే ఏదో ఒకటి చదువుకోండంటూ పిల్లలకు చెబుతున్నారు. 

కోడిగుడ్డు ఉత్తిమాటే
మధ్యాహ్న భోజనం అమలులో భాగంగా విద్యార్థులకు కోడిగుడ్లు కూడా సరఫరా చేస్తామని మూడు రోజుల కిందట విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఎక్కడా కోడిగుడ్లు ఇస్తున్న దాఖలాలు లేవు. ఇప్పటికే దాదాపు రెండునెలలుగా కోడిగుడ్లు ఇవ్వడం మానేశారు. తాజాగా కోడిగుడ్లు సరఫరాలో అధికారులు చెప్పిన మాటలు ఉత్తివేనని తేలిపోయాయి.  

మెటీరియల్‌ ఇవ్వలేదు  
సారోళ్లు ఫోన్‌ చేసి రమ్మని చెబితే స్కూల్‌కు వచ్చా. మెటీరియల్‌ ఏమీ ఇవ్వలేదు. మేగజైన్లు ఇచ్చి కథలు చదువుకోమని చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. కోడిగుడ్డు ఇవ్వలేదు.  – హుసేన్‌ 8వ తరగతి,పాపంపేట జెడ్పీహెచ్‌ఎస్‌

ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు పేర్లు ఎస్‌.ఇర్ఫాన్‌బాషా, ఎస్‌.ఖలీల్‌బాషా. ఇర్ఫాన్‌ 5వ తరగతి పూర్తయి 6వ తరగతికి వెళ్లాలి. ఖలీల్‌బాషా నాల్గో తరగతికి వెళ్తాడు. వీరిద్దరూ పాపంపేటలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో బడి సమీపంలో ఇలా ఓ చెట్టు కింద కూర్చుని కనిపించారు. ఏమని అడిగితే ఒక్క టీచరూ స్కూల్‌కు రాలేదని చెబుతున్నారు. 9 గంటల సమయంలో వంటమనిషి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించేశారు. అన్నం తినొచ్చి చెట్లకింద ఆడుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement