సాక్షి, కాకినాడ: రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసుర వధ’ పేరిట పార్టీ శ్రేణులు చేపట్టిన మూడురోజుల ఆందోళనల్లో రెండోరోజైన శుక్రవారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
అన్నదాతలు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా ఆందోళనల్లో పాల్గొని.. ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశవాదంపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికల ముందు ‘రుణాలు కట్టకండి..నేను అధికారంలోకి రాగానే మాఫీ చేస్తా’నన్న బాబును నమ్మి గెలిపిస్తే.. గద్దెనెక్కాక ఇప్పుడు మాట మార్చి రుణాలన్నీ చెల్లించాల్సిందేనంటూ బ్యాంకర్ల ద్వారా ఒత్తిడి చేయిస్తూ కపట నాటకమాడుతున్నారని మండిపడ్డారు. గంపెడాశతో ఉన్న తమను వంచించారని ఆక్రోశించారు. రుణాలన్నీ మాఫీ చేయాలని నినదించారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం నిరసన కార్యక్రమాలు మిన్నంటాయి.
రోడ్డుపై బైఠాయించిన జగ్గిరెడ్డి
కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆలమూరు బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీఎం దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. వాగ్దానం మేరకు బేషరతుగా రుణమాఫీ అమలు చేయకుంటే వైఎస్సార్ సీపీ రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జగ్గిరెడ్డి హెచ్చరించారు. సీతానగరం ఆర్ అండ్ బీ రహదారిపై పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో బైఠాయించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకున్న పోలీసులు
రాజానగరం పాత జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ మండల కమిటీ అధ్యక్షుడు ఎన్.వీర్రాజు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా సీఐ నాగమురళి అడ్డుకున్నారు. ‘దహనం చేస్తే కేసులు నమోదు చేస్తా’మని హెచ్చరించారు. దాంతో పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దిష్టిబొమ్మను పోలీసులు బలవంతంగా లాక్కోవడంతో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రం సమర్పించారు.
మండపేటలో మానవహారం
మండపేట రాజారత్నం సెంటర్లో మాజీ ఎంపీ, పార్టీ కో ఆర్డినేటర్ గిరజాల వెంకటస్వామి నాయడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మానవహారంగా ఏర్పడి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ వాణిజ్య, రైతు విభాగం జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నాయకుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో గోకవరం సెంటర్లో ధర్నా చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దహన ంచేశారు.
డ్వాక్రా మహిళల నిరసన
ఏలేశ్వరం జెడ్పీటీసీ సభ్యుడు జ్యోతుల పెదబాబు, ఎంపీపీ అయిల సత్యవతి, గొల్లపల్లి బుజ్జి, అలమండ చలమయ్యల ఆధ్వర్యంలో వందలాది మంది డ్వాక్రా మహిళలు బేషరతుగా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దనాపల్లి ఎస్‌బీహెచ్ బ్రాంచ్ ఎదుట ధర్నా చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రత్తిపాడు మండలం శరభవరం, రౌతులపూడి మండలం ములగపూడిలతో పాటు అన్నవరంలో సీఎం దిష్టిబొమ్మలను పార్టీ నేతలు దహనం చేశారు.
రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీల ఆధ్వర్యంలో మామిడికుదురు మండలం నగరం, పి.గన్నవరం మండలం నాగుల్లంకల్లో రాస్తారోకో చేసి సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాజోలు సెంటర్లో బొంతు రాజేశ్వరరావు, అయినవిల్లి మండలం నేదునూరు సెంటర్‌లో పార్టీ జిల్లా నాయకుడు మిండగుదిటి మోహన్‌ల ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు.
సామర్లకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ టౌన్ కన్వీనర్ మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మానవహారంగా నిలబడి చంద్రబాబు వైఖరిని నిరసించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. కొత్తపల్లి సెంటర్లో పార్టీ స్థానిక నాయకులు ధర్నా చేసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. తాళ్లరేవు తహశీల్దార్ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై మండల కన్వీనర్ దడాల బుజ్జిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో రాస్తారోకో నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.
నాడు బాస.. నేడు మోసం
Published Sat, Jul 26 2014 12:37 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM
Advertisement