ఎందుకు అర్హత లేదో రిమార్కు కాలంలో వివరణ
సాక్షి, హైదరాబాద్: తొలి దశలో రుణ విముక్తికి అర్హత పొందిన 22.79 లక్షల కుటుంబాల వివరాలను వెల్లడించిన సర్కారు.. రెండో జాబితాలో రుణ విముక్తికి అనర్హులుగా పేర్కొన్న 20.29 లక్షల కుటుంబాల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆధార్, రేషన్ కార్డులతో పాటు ఇతర వివరాలు సక్రమంగా లేని వారు ఈ జాబితాలో ఉన్నారు. వీరికి ఎందుకు అర్హత లేదో రిమార్కు కాలంలో సర్కారు వివరించింది. ఇందులో పేర్కొన్న వివరాలు ఉంటే వాటిని ఆన్‌లైన్‌లో లేదా జన్మభూమి గ్రామ కమిటీలకు అందజేసి, రుణ మాఫీకి అర్హత పొందవచ్చని తెలిపింది. ఈ వివరాలను జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా తనిఖీ చేస్తారు.
కుటుంబ సభ్యుల వివరాలు లేని ఖాతాలు, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్, రేషన్ కార్డు, సర్వే నంబర్లు సరిగా లేనివారు, మొత్తం రుణమెంతో సరిగా లేనివారి ఖాతాలను రెండో జాబితాలో చేర్చారు. వీటికి సంబంధించి సరైన వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని లేదా జన్మభూమి గ్రామ కమిటీలకు అందజేయాలని కోరారు.ఈ ప్రక్రియ పూర్తికి ప్రభుత్వం 4 వారాలు సమయమిచ్చింది. రూ. 10 లక్షలు రుణం తీసుకున్న వారు, 50 ఎకరాలున్న వారు, ఒకే ఆధార్ నంబర్, పలు రేషన్ కార్డులు ఉన్న 35,000 ఖాతాలను ప్రభుత్వమే నేరుగా తిరస్కరించింది.ఆమోదం లేని పంటలకు తీసుకున్న రుణాలనూ తిరస్కరించింది. ఒకే సర్వే నంబర్ మీద ఒకే సీజన్‌లో భూమి యజమాని, కౌలుదారు రుణాలు తీసుకున్నారని మరికొన్నింటిని తిరస్కరించింది.
ఆ కుటుంబాలకూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
ఇదిలా ఉండగా తొలి దశ జాబితాల్లోని కొన్ని రైతు కుటుంబాల్లో కొందరి ఖాతాలు కలపకపోవడం వల్ల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించలేదని ప్రభుత్వం గుర్తించింది. వీరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేసి, ఆ నిధులను రికవరీ చేయాలని నిర్ణయించింది. కుటుంబంలో నలుగురు రైతులు రుణం తీసుకుంటే వాటన్నింటినీ కాకుండా కేవలం ఇద్దరివే కలపడంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తించకుండా రూ.50 వేల వరకు మొత్తం రుణం మాఫీ జరిగినట్లు గుర్తించింది. ఈ నలుగురి ఖాతాల్లో రుణం కలిపితే రూ. 50 వేల పైన అవుతుందని, అప్పుడు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తిస్తుందని అభిప్రాయపడింది.
20.29 లక్షల అనర్హులతో రెండో జాబితా
Published Thu, Dec 11 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement